మహారాష్ట్రలో బీజేపీ, శివసేన లీడర్ల నామినేషన్

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన లీడర్ల నామినేషన్

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన లీడర్ల నామినేషన్
బీజేపీ ఎమ్మెల్యేలతో షిండే సమావేశం
బలపరీక్ష విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ


ముంబై/పణజి: మహారాష్ట్ర అసెంబ్లీలో ఆదివారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, శివసేన నుంచి రాజన్ సాల్వీ నామినేషన్ వేశారు. సేన రెబల్స్, బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించినా.. అనూహ్యంగా మహా వికాస్ అఘాడీ కూటమి తరఫున శివసేన ఎమ్మెల్యే రాజన్ రేసులోకి వచ్చారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. సోమవారం విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న సీఎం ఏక్‌‌నాథ్ షిండే సర్కారుకు ఆదివారమే తొలి గండం పొంచి ఉంది. బలపరీక్ష సమయంలో స్పీకర్ కీలకం కానున్నారు. దీంతో స్పీకర్ ఎన్నికలో షిండే వర్గం గట్టెక్కితే.. బలపరీక్షలో ఈజీగా పాస్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలతో ఏక్‌‌నాథ్ షిండే శనివారం సాయంత్రం వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. బలపరీక్ష విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

షిండే తొలగింపును సవాలు చేస్తం
మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్‌‌నాథ్ షిండేను శివసేన నుంచి తొలగిస్తూ ఉద్ధవ్ థాక్రే తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తామని రెబల్ సేన గ్రూప్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే దీపక్ కేసార్కర్ చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన షిండే.. స్వచ్ఛందంగా తన సభ్యత్వాన్ని కోల్పోయారని, ఇకపై శివసేన పార్టీలోని ఏ పదవిలోనూ ఆయన ఉండబోరని లేఖలో థాక్రే సంతకంతో ఉన్న లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేసార్కర్ మాట్లాడుతూ.. ‘‘శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో పార్టీ గ్రూప్ నేతగా షిండే ఎన్నికయ్యారు. షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ లెటర్ రాయడం.. మహారాష్ట్ర ప్రజలను అవమానించడమే. థాక్రే తీసుకున్న నిర్ణయం చట్టం ముందు నిలబడదు. షిండే స్థానాన్ని ఎవరూ లాక్కోలేరు” అని అన్నారు. 4న బల పరీక్ష తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు.