జన గణనలో కుల గణనకు అడ్డంకులు తొలిగాయి..సుప్రీంకోర్టు తీర్పుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హర్షం

జన గణనలో కుల గణనకు అడ్డంకులు తొలిగాయి..సుప్రీంకోర్టు తీర్పుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హర్షం

హైదరాబాద్, వెలుగు: జన గణనలో కుల గణన చేయవద్దనే పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడం పట్ల పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కోర్టు తీర్పుతో కేంద్రం జన గణనతో పాటు కుల గణన నిర్వహించే ప్రక్రియకు అడ్డంకులు తొలిగిపోయినట్లయిందని.. ఇది సామాజిక, ఆర్థిక అసమానతలను దూరం చేస్తుందన్నారు. కుల గణన అత్యంత అవసరమని  కాంగ్రెస్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తుందన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇదే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. సామాజిక న్యాయం సాధనకు, వెనుకబడిన వర్గాల వారికి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన తప్పనిసరి అని పేర్కొంటూ కాంగ్రెస్ చేసిన పోరాటం ఫలించిందన్నారు. తెలంగాణలో చేపట్టిన కుల సర్వే విధానాన్ని కేంద్రం ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా సమగ్ర కుల గణన చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.

కాగా..జనగణనలో కుల గణన చేయవద్దనే పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.  ఇది కాంగ్రెస్ సాధించిన విజయం అని, రాహుల్ గాంధీ పోరాటం ఫలించిందని నాయకులు పేర్కొన్నారు.