ప్రేమ వివాహం చేసుకొని.. తల్లితో కలిసి కొట్టి చంపిండు.. అదనపు వరకట్నం కోసం అమానుషం

ప్రేమ వివాహం చేసుకొని.. తల్లితో కలిసి కొట్టి చంపిండు.. అదనపు వరకట్నం కోసం అమానుషం
  • హాస్పిటల్​లో చేర్పించి పరార్​
  • తాండూరు పట్టణంలోని సాయిపూర్​లో ఘటన

వికారాబాద్, వెలుగు: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. తొలుత పెద్దలను ఎదిరించి, తర్వాత ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. 8 నెలలకే అదనపు వరకట్నం, బంగారం తీసుకురావాలంటూ భర్త, అత్త ఆ యువతిని శారీరకంగా, మానసికంగా వేధించారు. చివరికి తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతిచెందింది. తాండూరు టౌన్​సీఐ సంతోష్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్ కోటకు చెందిన అనూష(22) తాండూరు పట్టణంలోని సాయిపూర్ కు చెందిన పరమేశ్​ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులు తొలుత పెండ్లికి నిరాకరించారు. 

కానీ అనూష అతన్నే వివాహం చేసుకుంటానని మొండికేయడంతో ఒప్పుకున్న తల్లిదండ్రులు 3 తులాల బంగారం, రూ.లక్ష కట్నంగా ఇచ్చి 8 నెలల క్రితం పెండ్లి జరిపించారు. ఇటీవల అదనపు వరకట్నం, బంగారం తీసుకురావాలని భర్త పరమేశ్, అత్త లాలమ్మ అనూషను వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కుటుంబ పెద్దల సమక్షంలో ఇరువురిని సముదాయించి, అనూషను తిరిగి అత్తారింటికి పంపారు. 

బుధవారం రాత్రి ఆమెను భర్త, అత్త తీవ్రంగా కొట్టి, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యారు. విషయం తెలుసుకున్న అనూష పుట్టింటివారు గురువారం ఉదయం వచ్చి చూసే సరికి ఆమె మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డను అదనపు కట్నం కోసం భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.