ఒక్కోసారి విధి మనతో వింత నాటకం ఆడుతుంటుంది. చేయని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన తప్పు లేదని తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అప్పుడు తెలిసినా ప్రయోజనం శూన్యం. భోపాల్ లో అజయ్ సింగ్ అనే వ్యాపారికి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. గరం మసాలా తీసుకెళ్తుంటే హెరాయిన్ అనుకోని ఎయిర్ పోర్టులో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు... అతడికి 57 రోజుల జైలు శిక్ష కూడా విధించారు. కట్ చేస్తే... 16 ఏళ్ళ తర్వాత అజయ్ సింగ్ కు రూ. పది లక్షల నష్టపరిహారం అందింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
అజయ్ సింగ్ అనే వ్యాపారి మే 7 2010లో మలేషియా వెళ్లడం కోసం భోపాల్ ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి బయలుదేరాడు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా అజయ్ సింగ్ బ్యాగ్ లో గరం మసాలా ప్యాకెట్లు కనిపించాయి. వాటికి ఎక్సప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ లో అలర్ట్ వచ్చింది. ఆ ప్యాకెట్లలో హెరాయిన్ ఉందని అనుమానించారు సిబ్బంది. అజయ్ సింగ్ న అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు.
ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా గరం మసాలా ప్యాకెట్లను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ కి పంపగా.. ఆ ప్యాకెట్లలో ఎలాంటి డ్రగ్స్ లేవని తేలింది. క్లీన్ రిపోర్ట్ రావడంతో, దాదాపు రెండు నెలల పాటు జైలులో గడిపిన సింగ్, జూలై 2, 2010న విడుదలయ్యారు. అనంతరం అజయ్ సింగ్ పిటిషన్ మేరకు హైకోర్టులో జరిగిన విచారణ ఇండియన్ మసాలాలను గుర్తించడానికి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ మెషిన్లు టెస్ట్ చేయలేదని.. అందుకే అవి మసాలా ప్యాకెట్లను గుర్తించలేకపోయాయని వాదించారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా వ్యాపారి నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. సింగ్ ను అక్రమంగా శిక్షించినందుకు అధికారులు బాధ్యత వచించాలని తీర్పునిచ్చింది కోర్టు. సింగ్ కు రూ. పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని.. నెల రోజుల్లోగా మధ్యప్రదేశ్ లోని అన్ని ఎయిర్ పోర్టుల్లో, ల్యాబ్ లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మెషిన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కోర్టు.
