రాఫెల్, సుఖోయ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ఎక్సర్​సైజ్​లు

రాఫెల్, సుఖోయ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ఎక్సర్​సైజ్​లు

న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలను ప్రారంభించింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన ఈ రెండ్రోజుల ఎక్సర్ సైజ్​లో రాఫెల్, సుఖోయ్ 30ఎంకేఐ ఫైటర్ జెట్ లు, రవాణా విమానాలు, హెలికాప్టర్​లు, డ్రోన్​లతో పెద్ద ఎత్తున ఆపరేషనల్ రెడీనెస్  ఎక్సర్​సైజ్​లు నిర్వహిస్తున్నట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా సోల్జర్లకు, మన సోల్జర్లకు మధ్య జరిగిన గొడవకు, ఈ ఎక్సర్​సైజ్​కు సంబంధం లేదని, ఇది అంతముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని తెలిపింది. ఈశాన్యంలోని అన్ని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లలో ఈ ఎక్సర్ సైజ్ జరగనున్నట్లు పేర్కొంది. అయితే, రెండేండ్ల కిందట గల్వాన్ గొడవ తర్వాత నుంచీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఎల్ఏసీ వెంబడి, సిక్కిం సెక్టార్ లో ఐఏఎఫ్ తరచూ ఎక్సర్​సైజ్​లు నిర్వహిస్తోంది. కానీ గత వారం అరుణాచల్​లోని తవాంగ్ సెక్టార్​లో చైనాతో గొడవ జరగడం, ఆ తర్వాత చైనీస్ డ్రోన్ లు ఎల్ఏసీకి దగ్గరగా ఎగరడంతో ఐఏఎఫ్ కూడా ఎయిర్ యాక్టివిటీలను పెంచింది.

చివరి రాఫెల్ వచ్చేసింది

ఫ్రాన్స్ నుంచి 36వ రాఫెల్ ఫైటర్ జెట్ ఇండియాకు వచ్చేసింది. గురువారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన రాఫెల్ జెట్ మనదేశానికి చేరుకుంది. దీంతో ఫ్రాన్స్​తో కుదిరిన డీల్ ప్రకారం మొత్తం రాఫెల్ ఫైటర్ జెట్​లు అందినట్లయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. రాఫెల్ ఫైటర్ జెట్​ల కొనుగోలుకు ఫ్రాన్స్​తో 2016లో ఒప్పందం జరిగింది. మొత్తం రూ.59 వేల కోట్లకు 36 యుద్ధ విమానాల కొనుగోలుకు డీల్ కుదిరింది. దీని ప్రకారం.. ఫస్ట్ బ్యాచ్ రాఫెల్ ప్లేన్లు 2020, జులై 29న వచ్చాయి. ఆపై దశలవారీగా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 35 ఫైటర్ జెట్​లు ఐఏఎఫ్​కు  అందాయి. తాజాగా ఆఖరి జెట్ కూడా ఐఏఎఫ్ అమ్ములపొదికి చేరింది. ప్రస్తుతం హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో 18, భూటాన్ బార్డర్​లోని హసిమారాలో మరో 18 రాఫెల్ జెట్​లను ఐఏఎఫ్​ మోహరించింది.