తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి

తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి
  • జనగామ, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి జిల్లాల్లో ఘటనలు

రఘునాథపల్లి/ఆమనగల్లు/ఏటూరునాగారం/మోత్కూర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోడూరుకు చెందిన దాసరి యాకయ్య, రేణుక కొడుకు అజయ్ (22) తల్లితో కలిసి పశువులు మేపడానికి బావి దగ్గరకు వెళ్లాడు. అప్పుడే పిడుగుపడడంతో అజయ్​అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో ఆవు, లేగ దూడ కూడా ప్రాణాలు కోల్పోయాయి. దీన్ని చూసిన తల్లి రేణుక స్పృహ తప్పి పడిపోయింది.

 రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని గుర్రంగుట్ట సమీపంలో పశువులు మేపడానికి వెళ్లిన కావటి పద్మమ్మ (45) పిడుగుపడి చనిపోయింది. ఆదివారం సాయంత్రం వర్షం రావడంతో చెట్టు కింద నిలబడింది. అప్పుడే పిడుగు పడటంతో ఆమె మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓడవాడకు చెందిన బాస బుల్లయ్య (45) చేను వద్ద మిరపకాయలు ఆర బోశాడు. వర్షం వస్తుండడంతో తడ్వకుండా పరదాలు కప్పడానికి కొడుకు శివకుమార్​తో కల్లం వద్దకు బయలుదేరాడు. దారిలో పిడుగుపడడంతో బుల్లయ్య చనిపోయాడు. 

శివకుమార్ గాయపడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తికి చెందిన చిప్పలపల్లి నర్సయ్య (65) బయటకు వెళ్లి ఇంటికి వస్తుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఆత్మకూరు (ఎం) మండలం పారుపల్లిలో పిడుగుపడి రైతు బద్ధిపడిగ మల్లారెడ్డికి చెందిన ఆవు, గుండాల మండలం తుర్కలశాపురానికి చెందిన రైతు జక్కుల యాదయ్యకు చెందిన గేదె పిడుగుపాటుతో చనిపోయాయి.