ధర్మసాగర్, వెలుగు: మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేసిన ఘటన ధర్మసాగర్మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ కు చెందిన వైష్ణవిని స్థానికుడైన మాచర్ల రాకేశ్ప్రేమిస్తున్నానని నమ్మించి, శారీరకంగా వాడుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో బలానికి సంబంధించిన మాత్రలని చెప్పి, గర్భ నిరోధక మందులు ఇవ్వడంతో గర్భస్రావమైంది. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడగగా రాకేశ్నిరాకరించడంతో పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
రాకేశ్ ఠాణాలో పెద్దల సమక్షంలో మాట్లాడుకొని, వైష్ణవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గతేడాది ఎంగేజ్మెంట్కూడా జరిగింది. తర్వాత తాను పెళ్లి చేసుకోనని మొండికేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారు రాకేశ్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై బయటకు వచ్చిన రాకేశ్వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని వైష్ణవి ఆరోపించింది. గురువారం అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. రాకేశ్‌తో తనకు వివాహం జరిపించి, న్యాయం చేయాలని కోరింది.
