తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ.. బ్లింకిట్ అంబులెన్స్ సాయంపై ముంబై మహిళ భావోద్వేగం

తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ.. బ్లింకిట్ అంబులెన్స్ సాయంపై ముంబై మహిళ భావోద్వేగం

అర్ధరాత్రి వేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే యాప్ అండగా నిలుస్తుందని ఎవరూ ఊహించరు. కానీ ముంబైకి చెందిన ప్రాచీ అనే మహిళకు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎదురైన మెడికల్ ఎమర్జెన్సీలో బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్ ప్రాణదాతలా ఎలా నిలిచిందో ఆమె ఇన్‌స్టా వీడియోలో వివరించిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

ముంబైలో నివసిస్తున్న ప్రాచీకి ఢిల్లీలోని తన ఇంటి నుండి తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ వచ్చింది. తన పిన్నికి ఫిట్స్ వస్తున్నాయని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు కంగారుగా చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసినా 15 నిమిషాలైనా రాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీకి ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. ఆమె భర్త ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. బ్లింకిట్ యాప్‌లో అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉన్నాయని గతంలో చదివిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెంటనే ఆలస్యం చేయకుండా వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవటానికి ప్రయత్నించారు. 

ALSO READ : హోం లోన్, పర్సనల్ లోన్, ఆటో అప్పులపై వడ్డీ రేట్లు మారలేదు

వెంటనే ప్రాచీ బ్లింకిట్ యాప్ ఓపెన్ చేసి అంబులెన్స్‌ను బుక్ చేసింది. ఆశ్చర్యకరంగా నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ వారి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. బ్లింకిట్ సేవల వేగాన్ని చూసి అది కూడా తెల్లవారుజామున ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని చెప్పారు ప్రాచీ. ఆ క్లిష్ట సమయంలో సాయం అంత త్వరగా అందుతుందని అనుకోలేదని ప్రాచీ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ సర్వీస్ కోసం ఎంత డబ్బు చెల్లించడానికైనా ఆమె సిద్ధపడ్డారు.. కానీ బ్లింకిట్ ఆ అంబులెన్స్ సేవను ఉచితంగా అందించడం ఆమెను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం నిజమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ సేవను వినియోగించుకోవాలని యాప్‌లో కోరుతూ.. ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ సేవను నిర్వహిస్తోంది బ్లింకిట్ కంపెనీ.

ALSO READ : దక్షిణాది రాష్ట్రాల దూకుడు..ఏటా సగటున 6.8 శాతం వృద్ధి

దూరంగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి అవసరమైన సాయం అందించగలిగాననే తృప్తి ప్రాచీ మాటల్లో కనిపించింది. మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ ను చాలా ఈజీగా తీసుకుంటాం.. కానీ సంక్షోభం ఎదురైనప్పుడే వాటి విలువ తెలుస్తుందని ఆమె భావోద్వేగంగా చెప్పారు. గతేడాది గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్ ఇప్పటివరకు సుమారు 4,200 మందికి పైగా సహాయపడిందని ఆ సంస్థ సీఈఓ అల్బిందర్ ధిండా వెల్లడించారు. క్లిష్ట సమయంలో ఆపన్నహస్తం అందించిన బ్లింకిట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీ లాభాపేక్ష లేకుండా అందిస్తున్న సర్వీసుపై చర్చ కొనసాగుతోంది.