Repo Rate Unchanged: ఫిబ్రవరి 6, 2026న వెలువడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు కాస్త నిరాశనే మిగిల్చింది. వడ్డీ రేట్లు తగ్గుతాయని.. తద్వారా హోమ్ లోన్లు, కార్ లోన్ల ఈఎంఐల భారం తగ్గుతుందని ఆశించిన సామాన్యులకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా కమిటీ స్టేటస్ కో నిర్ణయం షాక్ కి గురిచేసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న 5.25% వడ్డీ రేటునే కొనసాగించాలని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
గత ఏడాది కాలంలో ఆర్బీఐ వరుసగా 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ.. ఈసారి మాత్రం వేచి చూసే ధోరణిని కొనసాగిస్తోంది. వడ్డీ రేట్లను ఎందుకు తగ్గించలేదనే దానికి గవర్నర్ ప్రధానంగా కొన్ని కారణాలను వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ 7.3% వృద్ధి రేటుతో పటిష్టంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన సవాళ్లు ఆర్థిక స్థిరత్వానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని మల్హోత్రా హెచ్చరించారు.
ALSO READ : మోడీ సర్కార్ పవర్ ఫుల్ నిర్ణయం
ముఖ్యంగా ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల ఎగుమతులకు సానుకూలత పెరిగినప్పటికీ, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, బాండ్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత వంటివి ఆర్బీఐని అప్రమత్తం చేశాయి. అలాగే కొత్త వినియోగదారుల ధరల సూచీ లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా.. ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. లోన్ ఈఎంఐల కోత కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది.
