దేశీయంగా ఈవీల వాడకాన్ని మరింత వేగవంతం చేసే దిశగా మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడమే లక్ష్యంగా.. పబ్లిక్ ఈవీ ఛార్జర్ల బెంచ్‌మార్క్ రేట్లను భారీగా తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంతో పోలిస్తే ఈవీ ఛార్జర్ల తయారీ ఖర్చు తగ్గడం.. మార్కెట్‌లో పోటీ పెరగడంతో ప్రభుత్వం ఈ మేరకు ధరలను సవరించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ సబ్సిడీ భారం తగ్గడమే కాకుండా, ప్రైవేట్ ఆపరేటర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.
కేంద్రం ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం.. వివిధ సామర్థ్యాలు కలిగిన ఛార్జర్ల ధరల్లో భారీగా రేట్ల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 60 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఛార్జర్ ధరను ఏకంగా 28 శాతం తగ్గించగా, 30 కిలోవాట్ల ఛార్జర్ ధరను 17 శాతం మేర తగ్గించారు. అలాగే హై-స్పీడ్ ఛార్జింగ్ అందించే 120 కిలోవాట్ల ఛార్జర్ల ధరపై 13 శాతం కోత విధించారు ప్రభుత్వం. ఉదాహరణకు.. గతంలో సుమారు 18 లక్షల రూపాయలు ఉన్న 100 కిలోవాట్ల ఛార్జర్ ధర ఇప్పుడు దాదాపు 13 లక్షల రూపాయలకు వస్తుంది. 2022లో ఈ ఛార్జర్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పాత బెంచ్‌మార్క్ ధరలను నిర్ణయించారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాటిని మార్కెట్ వాస్తవికతకు అనుగుణంగా తగ్గించారు.
ప్రభుత్వం ఈ బెంచ్‌మార్క్ ధరలను తగ్గించడం వెనుక భారీ వ్యూహం ఉంది. కేంద్రం 'పీఎం ఈ-డ్రైవ్' వంటి స్కీమ్స్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భారీగా సబ్సిడీలు అందిస్తోంది. కొన్ని సందర్భాల్లో 50 kW నుంచి 100 kW ఛార్జర్ల మొత్తం ఖర్చును సబ్సిడీ రూపంలోనే ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు బెంచ్‌మార్క్ ధరలు తగ్గడం వల్ల.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం ఆదా అవుతుంది. ఇప్పుడు అదే నిధులతో దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే వీలుంటుంది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 29వేల 200 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను లక్షల్లోకి తీసుకెళ్లాలని మోడీ సర్కార్ భావిస్తోంది.
►ALSO READ | సైలెంటుగా మీ ఫోన్‌ల నుండే స్కామ్ మెసేజ్‌లు : వింగో (Wingo) గేమింగ్ యాప్‌పై నిషేధం
దేశంలో ఈవీల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022లో 1.3 శాతంగా ఉన్న ఈవీల వాటా, 2024 నాటికి 4.7 శాతానికి చేరింది. ముఖ్యంగా టూ-వీలర్లు, త్రీ-వీలర్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు దూసుకుపోతున్నాయి. అయితే ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ప్రైవేట్ కంపెనీలు సబ్సిడీలపై తక్కువగా ఆధారపడుతూనే, తక్కువ ధరకే ఛార్జర్లను కొనుగోలు చేసి స్టేషన్లను నిర్మించగలవు. ఇది అంతిమంగా సామాన్యులకు ఈవీ ఛార్జింగ్ సౌకర్యాన్ని మరింత చేరువ చేయడమే కాకుండా.. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను వేగంగా విస్తరింపజేయనుంది.
