ఈఎంఐలో మామిడి పండ్ల అమ్మకం.. మహారాష్ట్రలోని పుణె వ్యాపారి ప్రకటన

ఈఎంఐలో మామిడి పండ్ల అమ్మకం.. మహారాష్ట్రలోని పుణె వ్యాపారి ప్రకటన

పుణె: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫోన్లు తదితర వస్తువులను ఈఎంఐలలో కొనుగోలు చేయడం సాధారణమే! అయితే, మహారాష్ట్రలో ఓ వ్యాపారి మామిడి పండ్లను కూడా ఈఎంఐ కింద అమ్ముతున్నాడు. పుణెకు చెందిన గౌరవ్‌‌ సనాస్‌‌ అనే వ్యాపారి గురుకృప ట్రేడర్స్‌‌ అండ్‌‌ ఫ్రూట్‌‌ ప్రాడక్ట్స్‌‌ పేరుతో బిజినెస్‌‌ చేస్తున్నాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మామిడి పండ్ల సీజన్​ మొదలైంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌‌లోకి పండ్లు వస్తున్నాయి. సీజన్‌‌ స్టార్టింగ్‌‌ కావడంతో పండ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని కొంకణ్‌‌ రీజియన్‌‌లో దేవ్‌‌గఢ్​, రత్నగిరి ప్రాంతాల్లో ఎక్కువగా పండే అల్ఫాన్సో రకం మామిడి పండ్ల రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి.

ఈ పండ్ల ధర డజన్‌‌కు రూ.800 నుంచి రూ.1,300 పలుకుతున్నాయి. ఇంత కాస్ట్‌‌ పెట్టి జనాలు ఈ పండ్లను తినలేరని గౌరవ్‌‌ భావించాడు. దీంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఈఎంఐలలో అమ్ముతున్నట్లు.. మామిడి పండ్లను ఎందుకు ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌లో విక్రయించకూడదు అనుకున్నాడు. ఆ వెంటనే ఎక్కువ ధర పెట్టి మామిడి పండ్లు కొనలేని వారికి ఈఎంఐ ద్వారా పండ్లు కొనే వెసులుబాటు కల్పించాడు. అయితే, క్రెడిట్‌‌ కార్డు ద్వారా కొనే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాడు. అది కూడా రూ.5 వేల విలువ చేసే మామిడి పండ్లు కొంటేనే ఈఎంఐ అప్షన్‌‌ వర్తిస్తుందని చెప్పాడు. కొన్న పండ్లను మూడు, ఆరు, 12 నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చని వెల్లడించాడు. ఇప్పటివరకు ఈ ఆప్షన్‌‌ను నలుగురు  ఉపయోగించుకున్నారని గౌరవ్‌‌ తెలిపాడు.