రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్​ ఓటింగ్

రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్​ ఓటింగ్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్​ లక్ష్మణ్​ అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వివిధ పార్టీల నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలిపారు. క్రాస్ ఓటింగ్ విషయంలో ఎవరినీ బీజేపీ ఒత్తిడి చేయలేదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి మనోభీష్టానికి అనుగుణంగా ఓటేశారన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకమన్నారు. కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర సర్కార్.. జయంత్ బంతియా కమిషన్ రిపోర్ట్ లోని డేటాను శాస్త్రీయంగా  జోడించి, సంకలనం చేసి సుప్రీం కోర్ట్ అడిగిన విధంగా సమర్పించిందని తెలిపారు. దీని ఆధారంగా మహారాష్ట్రలో  జరుగబోయే  అన్ని  స్థానిక సంస్థల  ఎన్నికల్లో 27 శాతం ఓబీ సీ రిజర్వేషన్స్ పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులకు సుప్రీం ఆదేశించిందన్నారు.