ఓటర్లు పెరుగుతున్నా .. ఓటింగ్ పెరగట్లే

ఓటర్లు పెరుగుతున్నా .. ఓటింగ్ పెరగట్లే
  • అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల మధ్య చాలా తేడా
  • ఓటింగ్​శాతం పెంచేందుకు అధికారుల చర్యలు ఫలించేనా..?

మెదక్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న చర్యలతో ఓటర్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. 18 ఏళ్లు నిండిన వారు ఓటర్ గా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండడంతో అర్హత ఉన్నవారు ముందుకు వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. కాగా అధికారులు విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ మెదక్​లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్​ శాతం తగ్గింది.

 అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 పార్లమెంట్​ఎన్నికల్లో సైతం  ఓటింగ్ శాతం తగ్గడం గమనార్హం.  మెదక్  జిల్లాలో 74  శాతం,  సిద్దిపేట జిల్లాలో 72.18 శాతం, సంగారెడ్డి జిల్లాలో 67.56 శాతం ఓటింగ్​ మాత్రమే జరిగింది. వంద శాతం ఓటింగ్​ లక్ష్యంగా అధికార యంత్రాంగం గ్రామాలు, పట్టణాల్లో ఓటు విలువ, ఓటు హక్కు ప్రాధాన్యం తెలిపేలా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన, చైతన్య  కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ పోలింగ్​ అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు.  

ప్రజలు అసెంబ్లీ ఎన్నికలపై చూపినంత ఆసక్తి పార్లమెంట్ ఎన్నికలపై చూపడం లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు సైతం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీలైనంత వరకు ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేయడంతోపాటు వీలైనంత ఎక్కువ మందిని పోలింగ్​ కేంద్రానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు వాహనాలు ఏర్పాటు చేసి తీసుకువచ్చి ఓటు వేసేలా చూస్తున్నారు. కానీ పార్లమెంట్​ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండటం లేదు. దీనివల్ల ఓటింగ్​ శాతం తగ్గుతోంది.  

2.23  లక్షలు పెరిగారు

మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలకు  ఇప్పటికి 2.23 లక్షల మంది ఓటర్లు పెరిగారు. గత పార్లమెంట్​ఎన్నికల సమయంలో 16,04,947 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఓటర్ల సంఖ్య 18,28,210కి పెరిగింది. గత ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటరు జాబితా ప్రకారం 18,12, 858 మంది ఓటర్లు ఉండగా రెండు నెలల్లో 15,352 మంది ఓటర్లు పెరిగారు. గత పార్లమెంట్​ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 2,23 లక్షల ఓటర్లు పెరగ్గా, తదనుగుణంగా ఈ సారి ఎన్నికల్లో  ఓటింగ్​శాతం పెరుగుతుందో లేదో చూడాలి.