పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో గురువారం ఏబీసీ అధికారులు దాడులు నిర్వహించి అకౌంట్స్ ఆఫీసర్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇదే కార్యాలయంలో ఆంజనేయులు అనే వ్యక్తి మజ్దూర్‌గా పనిచేసి గతేడాది అక్టోబర్‌లో రిటైర్డ్ అయ్యాడు. పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ క్లియరెన్స్ కోసం అకౌంట్స్ సెక్షన్లో పత్రాలు సమర్పించాడు.
సెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ఆ ఫైల్‌ను హెడ్డాఫీస్‌కు పంపకుండా ఆరు నెలలుగా తన వద్దే ఉంచుకున్నాడు. ఫైల్ క్లియరెన్స్ కోసం రూ.40 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరకు రూ.35 వేలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం సాయంత్రం బాధితుడి నుంచి సంతోష్‌కుమార్ రూ.35 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో మరెవరి ప్రమేయమేమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
