రాజ్యసభ స్థానాలకు.. సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం!

రాజ్యసభ స్థానాలకు.. సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం!
  • రెండు రాజ్యసభ స్థానాలకు రెండు నామినేషన్లే దాఖలు
  • ఈ నెల 9న అధికారిక ప్రకటన.. 
  • కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు తరలివచ్చిన సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడం, ఈ ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఖాయమైంది. రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. కంటె సాయన్న అనే ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా.. అది ఎన్నికల నిబంధనలకు లోబడి లేదు. రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేయాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ పై ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రతిపాదన లేకపోవడంతో శుక్రవారం చేపట్టనున్న స్ర్కూటినీలో అది తిరస్కరణకు గురవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఈనెల 9న నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సింఘ్వీ, వేం నరేందర్​ రెడ్డిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించి, ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. ఖాళీ అయిన రెండు సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్​కు చెరోటి ఉండగా ఇప్పుడు ఆ  రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనున్నాయి. సింఘ్వీ, కేఆర్ సురేశ్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్​ 10 వరకు ఉంది. అదే నెల11 నుంచి సిట్టింగ్ సభ్యుడు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఆరేళ్ల పదవీకాలానికి కొత్త సభ్యులుగా బాధ్యతలు తీసుకోనున్నారు.

సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు, 
ఎమ్మెల్యే సమక్షంలో నామినేషన్లు

రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్​రెడ్డి.. గురువారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు, 
ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు వెంటరాగా.. మూడో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క,  సీనియర్ నేత కేకే, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, విప్ బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా: అభిషేక్​ సింఘ్వీ

తనకు రెండోసారి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. రెండేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నానని, ఈ సారి కూడా  తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున సుప్రీంకోర్టు లో కేసులను వాదిస్తానన్నారు. మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసిన పీసీసీ, ఏఐసీసీ పెద్దలకు సింఘ్వీ ధన్యవాదాలు తెలిపారు. మరో అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన పార్టీ హైకమాండ్, రాష్ట్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్​వేదికగా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి తన గళం విప్పుతాననన్నారు. వీరిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్​హైకమాండ్​ ప్రకటించిన అనంతరం గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్ కు వచ్చి పీసీసీ చీఫ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్​గౌడ్ తో కలిసి వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. మహేశ్​గౌడ్ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలను కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయడం మంచి పరిణామమని, ఈ ఇద్దరూ  తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడుతారని పేర్కొన్నారు.