పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ట్రాఫిక్ సూచికలు..రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్ఎండీఏ ప్లాన్ 

పీవీ ఎక్స్ ప్రెస్ వేపై  ట్రాఫిక్ సూచికలు..రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్ఎండీఏ ప్లాన్ 
  • రూ. 1.38 కోట్లతో రోడ్డు సేఫ్టీ ప్రాజెక్టు త్వరలోనే టెండర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: అతిపెద్దదైన పీవీ ఎక్స్​ప్రెస్​హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో హెచ్ఎండీఏ నివారణ చర్యలు చేపట్టింది. సుమారు 17 ఏండ్ల కింద నిర్మించిన 11.60 కి.మీ. పొడవైన ఈ ఫ్లై ఓవర్​పై ఫోర్​వీలర్స్​కే మాత్రమే అనుమతి ఉంది. దీనిపై ఇప్పటికీ ఎలాంటి ట్రాఫిక్​సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఎక్స్​ప్రెస్​వేపై చాలా చోట్ల మూల మలుపులు ఉండడంతో హైస్పీడ్​తో వెళ్తూ అదుపు తప్పుతున్నాయి.

కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కూడా యాక్సిడెంట్లు పెరగడానికి కారణమవుతున్నది. అంతేగాకుండా లక్ష్మీనగర్​(పిల్లర్​ నంబర్​84 నుంచి 88 వరకు), ఉప్పర్​పల్లి (పిల్లర్ నంబర్170) వైపు, ఆరామ్​ఘర్​వద్ద ఫ్లై ఓవర్​పైకి ఎక్కడానికి, దిగడానికి రెండు వైపులా ఎగ్జిట్​, ఎంట్రీ పాయింట్లున్నాయి. సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పైకి ఎక్కే టైంలో, దిగే సమయంలో ట్రాఫిక్​ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

స్టార్టింగ్ ​నుంచి ఎండింగ్​ వరకు..

ప్రమాదాల నివారణకు పీవీ ఎక్స్​ప్రెస్​పై రూ.1.38 కోట్లతో అధికారులు రోడ్ సేఫ్టీ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్​పై స్టార్టింగ్ ​నుంచి ఎండింగ్​ వరకు తరచూ ట్రాఫిక్​ జామ్​అయ్యే ప్రాంతాలను గుర్తించారు. అలాగే,  ఫ్లై ఓవర్​పై ఎక్కడ ఎంత స్పీడ్​తో వెళ్లాలి? ఎక్కడ మలుపులు ఉన్నాయి అన్న విషయాలు తెలిసేందుకు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లై ఓవర్​కు రెండు వైపులా రిఫ్లెక్టివ్​ బోర్డులు కూడా పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే టెండర్లను పిలవనున్నారు. ఎంపిక చేసిన కంపెనీ మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలన్న నిబంధన పెట్టారు.