వరద రోజుల్లో వాడుకున్న నీళ్ల లెక్క వద్దట! వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

వరద రోజుల్లో వాడుకున్న నీళ్ల లెక్క వద్దట! వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
  •     వరద రోజుల్లో 215 టీఎంసీల వాడకం
  •     వాటిని లెక్కలో కలపవద్దని వాదన
  •     వరద రోజుల తర్వాత వాడిన 465 టీఎంసీలే లెక్కించాలని డిమాండ్​
  •     సాగర్​ నుంచి మరో 73.50 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏపీ జలదోపిడీకి అడ్డుఅదుపూ లేకుండా పోతున్నది. జనవరి నాటికే కృష్ణాలో 680 టీఎంసీల నీటిని తోడేసుకున్న పొరుగు రాష్ట్రం.. తాను వాడుకున్నది 465 టీఎంసీలేనని, దానినే లెక్కలోకి తీసుకోవాలంటూ వితండ వాదం చేస్తూ బోర్డుకు ఇటీవల లేఖ రాసింది. నిరుడు వర్షాకాలంలో శ్రీశైలానికి 2,343 టీఎంసీల వరద వచ్చిందని, అందులో 1,513 టీఎంసీల మేర వాస్తవ వరద ఉందని పేర్కొంది. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు తాము వాడుకున్నది 681.35 టీఎంసీలని పేర్కొన్న ఏపీ.. నవంబర్​ 1 వరకు వరద రోజుల్లో 215.69 టీఎంసీలు, ఆ తర్వాత ఇప్పటివరకు 465.66 టీఎంసీలు వాడుకున్నట్టు వెల్లడించింది. అయితే, ఇక్కడే ఏపీ కొత్త తిరకాసు పెట్టింది. వరద రోజుల్లో వాడుకున్న నీటిని ఏపీ ఖాతాలో వేయొద్దని బోర్డును కోరింది. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించామని, వరద జలాలు సముద్రం పాలవకుండా నీటిని ఆదా చేశామని పేర్కొంది. వరదలు వచ్చినప్పుడు తరలించిన జలాలను ఏపీ అకౌంట్​లో వెయ్యవద్దంటూ బోర్డును కోరింది. అంతేకాదు.. ఇప్పుడు వాడుకున్న దానికి అదనంగా 73.50 టీఎంసీల జలాలు కావాలని డిమాండ్​ చేసింది. సాగర్​ కుడి కాల్వ, ఎడమ కాల్వ కింద తాగునీటి కోసం ఆ మొత్తం నీటిని కేటాయించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో తెలంగాణ జల విద్యుదుత్పత్తి కోసం  నిరుడు నవంబర్​ 2 నుంచి 11 వరకు శ్రీశైలం నుంచి 28.86 టీఎంసీలు, సాగర్​ నుంచి 33.44 టీఎంసీలు తీసుకుని నీటిని వృథా చేసిందని ఆరోపించింది. ఇకపై తెలంగాణ నీటిని వేస్ట్​ చేయకుండా కోటాలో కత్తెర పెట్టాలని కోరింది.

ఇదీ ఏపీ చెబుతున్న లెక్కల ప్రకారం నీటి వినియోగం (టీఎంసీల్లో)
ప్రాజెక్ట్​/ఔట్​లెట్​                                                             నీటి తరలింపులు
                                                                      జులై 30 - నవంబర్​ 1 వరకు           నవంబర్​ 2 నుంచి

పోతిరెడ్డిపాడు    88.13    109.295
హంద్రీ నీవా    13.51    34.270
సాగర్ కుడి కాల్వ    41.53    113.14
సాగర్​ ఎడమ కాల్వ (ఏపీ)    9.17    18.11
ప్రకాశం బ్యారేజ్​    63.45    101.91
గుంటూరు చానెల్​    000    1.73
తుంగభద్ర/కేసీ కెనాల్​    000    84.05
చెన్నై వాటర్​ సప్లై    000    3.163
మొత్తం    215.69    465.66