- కిడ్స్‌వేర్ బట్టల దుకాణం దగ్ధం
- హాస్పిటల్, బ్యాంకులోనూ కాలిపోయిన ఫర్నిచర్
చార్మినార్, వెలుగు: ఫత్తర్‌ఘట్టి మదీనాలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో ఉన్న యూనిస్ కిడ్స్‌వేర్ బట్టల దుకాణంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధమయ్యాయి. ఉదయం 9 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు ఫైర్ స్టేషన్ల సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించారు. భారీ క్రేన్ల సహాయంతో మంటలను ఆర్పగా, సహాయక చర్యల కోసం రోడ్డుకు ఆనుకుని ఉన్న గోడలను జేసీబీతో తొలగించారు.
మెట్రో వాటర్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఈ ప్రమాదంలో విజయ డయాగ్నస్టిక్, కెనరా బ్యాంక్‌లోని కొంత ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. ఈఘటనతో చార్మినార్ నుంచి మదీనా వైపు వెళ్లే రహదారిని మధ్యాహ్నం వరకు మూసివేశారు. చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, మీర్‌చౌక్ ఏసీపీ శ్యాంసుందర్, ఇన్‌స్పెక్టర్ రాంబాబు సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దుకాణ యజమాని మహ్మద్ యూనుస్ ఆరోపించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ ఘటనాస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లంగర్ హౌస్‌లో మరో ప్రమాదం..
మెహిదీపట్నం: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూఘాట్ ప్రాంతంలో పెళ్లి పందిరులకు ఉపయోగించే బొంగులు, తడకలు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం సాయంత్రం పుట్ట శివకు చెందిన అలంకరణ సామగ్రికి మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే బొంగులు, తడకలు పూర్తిగా కాలిపోయాయి.
