- మిరోస్లావ్ క్లోజ్ 16 గోల్స్ రికార్డు సమం
- ఐదు వరల్డ్ కప్స్‌లో గోల్స్ చేసిన
- రెండో ప్లేయర్‌గా ఘనత
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ.. ఫిఫా వరల్డ్ కప్‌లో విశ్వరూపం చూపెట్టాడు. మెగా ఈవెంట్‌లో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఫలితంగా గ్రూప్-జే లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాపై గెలిచింది.
కాన్సాస్ సిటీ: డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ.. ఫిఫా వరల్డ్ కప్‌లో విశ్వరూపం చూపెట్టాడు. మెగా ఈవెంట్‌లో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఫలితంగా బుధవారం జరిగిన గ్రూప్–జే లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0తో అల్జీరియాపై గెలిచింది. 17, 60, 76వ నిమిషాల్లో గోల్స్ చేసిన మెస్సీ.. మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ లెజెండ్ మిరోస్లావ్ క్లోజ్ (16) రికార్డును సమం చేశాడు. రొనాల్డో (బ్రెజిల్,15), గెర్డ్ ముల్లర్ (జర్మనీ, 15), కైలిన్ ఎంబాపే (ఫ్రాన్స్, 14) తర్వాత ప్లేస్‌ల్లో ఉన్నారు.
అలాగే ఐదు వేర్వేరు వరల్డ్ కప్స్‌లో గోల్స్ సాధించిన రెండో ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరసన నిలిచాడు. అర్జెంటీనా తరఫున మెస్సీ వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేసి సరిగ్గా 20 ఏళ్లు పూర్తయిన రోజే ఈ మైలురాళ్లను అందుకోవడం విశేషం. వచ్చే వారం 39వ పడిలోకి అడుగుపెడుతున్న మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 200 మ్యాచ్ కావడం మరో విశేషం. రొనాల్డో (228) ముందున్నాడు.
కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఆరో వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ.. మ్యాచ్ ఆరంభం నుంచి గ్రౌండ్‌లో చురుకుగా కదిలాడు. ఇంటర్ మయామి సహచర ప్లేయర్ రోడ్రిగో డి పాల్ అందించిన పాస్‌ను తొలి గోల్‌గా మలిచాడు. సెకండాఫ్ ఆరంభంలో రీబౌండ్ బాల్ ద్వారా రెండో గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత పెనాల్టీ బాక్స్ వెలుపలి నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
అంతకుముందే మెస్సీ కొట్టిన ఒక గోల్‌ను అంపైర్లు ఆఫ్ సైడ్‌గా ప్రకటించారు. మరో మ్యాచ్‌లో ఆస్ట్రియా 3–1తో జోర్డాన్‌పై నెగ్గింది. రొమానో షిమిడి (20వ ని), యజాన్ అలరాబ్ (76వ ని), మార్కో అర్నాటోవిచ్ (90+12వ ని) ఆస్ట్రియాకు గోల్స్ అందించారు. జోర్డాన్ తరఫున అలీ ఒవన్ (50వ ని) గోల్ కొట్టాడు.
