భారత స్టాక్ మార్కెట్లను గురువారం నష్టాలు చుట్టుముట్టాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ 19 సంవత్సరాల గరిష్ట స్థాయికి దూసుకెళ్లడం, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల అంశాల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఏకంగా ఒక శాతానికి పైగా నష్టపోయాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 800 పైచిలుకు పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 50 సూచీ 250 పాయింట్లు పడిపోయి నష్టాలతో కొనసాగుతున్నాయి.
ఈ భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ.480 లక్ష కోట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ నష్టాల్లో బజాజ్ ఫైనాన్స్ షేరు 5 శాతానికి పైగా కుప్పకూలగా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు 3-4 శాతం మేర పడిపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక్క శాతం చొప్పున నష్టపోవడంతో మార్కెట్ మొత్తం రెడ్ జోన్‌లోకి జారుకుంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
1. బాండ్ ఈల్డ్స్: సెప్టెంబర్ నెలలో అమెరికా వ్యాపార కార్యకలాపాలు 5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో.. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 2007 తర్వాత అత్యధికంగా 5.10 శాతానికి పైగా ఎగబాకాయి. ఇది డెట్ మార్కెట్ల వైపు పెట్టుబడులను ఆకర్షించి, ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకు దారితీసింది.
2. ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లో భయాందోళనలను పెంచాయి. అక్టోబర్‌లో రేట్ల పెంపు ఉంటుందనే అంచనాలు ట్రేడర్లలో పెరిగాయి.
3. భారీగా పెరిగిన క్రూడ్ ధరలు: ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ ప్రకటనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 102 డార్లకు పైకి చేరుకోవటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైంది.
4. పడిపోయిన రూపాయి విలువ: క్రూడ్ ధరల పెరుగుదల, బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్‌తో పాటు విదేశీ ఇన్వెస్టర్లు(FIIs) నిరంతరం షేర్లను అమ్మేస్తుండటం రూపాయి విలువ క్షీణించి, సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
