కేసీఆర్ నాపై పెద్ద బాధ్యత పెట్టారు : ఎర్రబెల్లి

కేసీఆర్ నాపై పెద్ద బాధ్యత పెట్టారు : ఎర్రబెల్లి

కరీంనగర్ : త్వరలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తేబోతున్నట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన ఉమ్మడి జెడ్పీ సమావేశంలో మాట్లాడిన ఆయన ..తనపై సీఎం కేసీఆర్ పెద్ద బాధ్యత పెట్టారన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం వల్ల స్థానిక సంస్థల అధికారాలు గల్లంతయ్యాయని..త్వరలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తేబోతున్నామని చెప్పారు. దాని ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని..స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు ఇస్తే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు.

అసెంబ్లీలో చట్టసవరణ చేశాక స్థానిక సంస్థలకు చెక్ పవర్, అధికారాలు ఇస్తామని తెలిపిన ఎర్రబెల్లి..చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామన్నారు.  పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథను ఇతరరాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో లోపాలున్నాయి. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత పాలనా అందివ్వాలన్నది సీఎం ఆలోచన. నిధుల విషయంలో కరీంనగర్ కు పెద్దపీట వేస్తామని తెలిపారు మంత్రి.