చంపడమే పరిష్కారం కాదు

చంపడమే పరిష్కారం కాదు

హుజూరాబాద్, వెలుగు: సమాజంలో దిశలాంటి సంఘటనలకు చంపడం, ఉరిశిక్ష అనేవి తాత్కాలికమైన పరిష్కారాలని, సమాజంలోనే మార్పు రావాలని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ఇందుకు మంచి, చెడులపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. శనివారం కరీంనగర్​జిల్లా హుజూరాబాద్​పట్టణంలోని సాయిరూప గార్డెన్​లో జరుగుతున్న మానవ వికాస వేదిక రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సెల్ ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మానవ కల్యాణం, సుఖమయ జీవనానికి ఉపయోగపడాలని.. కానీ అవే మానవ జీవితాన్ని ధ్వంసం చేస్తాయని ఊహించలేకపోయామని చెప్పారు. ‘‘మానవ సంబంధాలు నాశనం అయ్యాయి, సమాజంలో మార్పు రావాలి. మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న తేడాలను గమనించాలి. మానవ వికాస వేదిక లాంటి సంస్థలు ప్రజలను చైతన్యపర్చాలి. టెక్నాలజీ ఇంత పెరిగినా ప్రపంచంలో మూఢ నమ్మకాలు, మంత్రాల నెపంతో హత్యలు జరుగుతున్నాయి’’అని పేర్కొన్నారు. బయటకు వెళ్లినవాళ్లు క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని, కంచే చేను మేసినట్లు పిల్లలపై తండ్రులే క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత డబ్బు ఉన్నా తమ బిడ్డలు ఏమైపోతారోనని భయపడాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.