- సంబరాజు రవి ప్రకాశరావు ‘వరదన్న రామాయణం, తిక్కన’ కావ్యాల ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: పద్య సాహిత్యానికి తెలంగాణ పెట్టింది పేరని, ఇక్కడి సంస్థానాల కాలం నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ ప్రతిభాపాటవాలతో అద్భుతమైన కావ్యాలను అందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ప్రముఖ కవి, పండితుడు సంబరాజు రవి ప్రకాశ రావు రచించిన ‘వరదన్న రామాయణం’, ‘తిక్కన’ కావ్యాలను ఆవిష్కరించారు.
వానమామలై రాసిన పోతన చరిత్రలో అంతర్లీనంగా ఉన్న 109 పద్యాల రామాయణ మధుర ఘట్టాన్ని విడదీసి, దానికి చక్కని వ్యాఖ్యను జోడించి ‘వరదన్న రామాయణం’ పేరుతో తీసుకురావడం సంతోషకరమన్నారు. 1958లో ప్రచురితమై, ప్రస్తుతం లభ్యం కాకుండా పోయిన వేముగంటి నరసింహాచార్యుల ‘తిక్కన’ కావ్యాన్ని వెలికితీసి, దానికి విశేష వివరణలతో వ్యాఖ్య రాసి ప్రచురించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడు ముచ్చర్ల దినకర్, వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
