పొట్ట ఉంటే ప్రమోషన్ ఇవ్వొద్దు : మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పొట్ట ఉంటే ప్రమోషన్ ఇవ్వొద్దు : మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి మల్లారెడ్డికి నోటి దురుసు కాస్త ఎక్కువే అని మరోసారి రుజువు అయ్యింది. ఆడటం, పాడటమే కాదు.. అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. సందర్భం కాకున్నా ఏదో ఇష్యూ మాట్లాడి.. కాంట్రవర్సీ చేస్తుంటారు. ఓ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ , డీజీపీ అంజనీకుమార్ లతో పాటు మంత్రి మల్లారెడ్డి   ఆశీనులయ్యారు. అక్కడ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

పొట్ట ఉన్న వారికి ప్రమోషన్ ఇవ్వొద్దు

కార్యక్రమం గురించి వదిలేసి పోలీసుల గురించి మాట్లాడారు. పోలీసులకు పొట్ట  ఉంటుందని, అలా అయితే కష్టం అన్నారు. పోలీసులు ఫిట్‌గా ఉండాలని.. వారిని చూస్తేనే దొంగలు భయపడిపోవాలని అన్నారు. బొజ్జ   ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని అన్నారు. అంతేకాదు ఖాకీలు   ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలో జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 12వ తేదీన తెలంగాణ రన్ 1లక్ష మంది తో నిర్వహించి తెలంగాణ లో రికార్డ్ సాధిస్తామని అని మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ డిఎస్ చౌహన్ కి ఛాలెజ్ చేశారు.

నాలాగా ఫిట్ గా ఉండాలి: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ పోలీసులు  దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని మంత్రి మల్లారెడ్డి  గుర్తుచేశారు. మన పోలీసులు చక్కగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం త్వరగా జరుగుతోందని తెలిపారు. సో.. పోలీసులు మంచి ఫిట్‌గా ఉండాలని కోరారు. అందుకే పొట్ట తగ్గించుకోవాలని.. తనలాగా ఫిట్ గా ఉంటేనే ప్రమోషన్లు ఇవ్వండంటూ కామెంట్స్ చేశారు. మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మంత్రి మాటలకు హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ నవ్వుకున్నారు. 

చర్చకు దారితీసిన మంత్రి కామెంట్స్ 

మంత్రి మల్లారెడ్డి  చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. పోలీసుల గురించి ఇలా మాట్లాడటంపై కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, నేతల భద్రత కోసం పనిచేస్తాం అని.. నిరంతరం డ్యూటీలో ఉంటామని చెబుతున్నారు. తమను ఇలా అనడం బాధించిందని కొందరు పోలీసుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఏదేమైనా మల్లన్న నోట వచ్చే మాటలకు ఎవరైనా అవాక్కువాల్సిందే.