- ఈడీ, సీబీఐ కేసుల్లో ఆదేశించిన కోర్టు
- సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌పై కొనసాగిన వాదనలు
- కరెన్సీ సీరియల్ నంబర్లను హవాలాకు టోకెన్లుగా వాడుకున్నారన్న ఈడీ
- మరిన్ని వివరాలు కోరిన జడ్జి.. విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ సోమవారం ముగియడంతో తీహార్ జైలు అధికారులు కవితను వర్చువల్ మోడ్‌లో రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. తొలుత సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీపై విచారణ జరిగింది.
ఆమె కస్టడీని పొడిగించాలని సీబీఐ తరఫు అడ్వకేట్ పంకజ్ గుప్తా కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సీబీఐ కేసులో కవిత కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. తర్వాత ఈడీ కేసులోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీపై విచారణ జరిగింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టును కోరారు.
అలాగే కవితతో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై వర్చువల్ మోడ్‌లో కవిత అడ్వకేట్ నితేశ్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, కవితను విడుదల చేయాలని కోరారు. అయితే చార్జ్ షీట్ దాఖలు చేసినంత మాత్రానా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పును ఈడీ ప్రస్తావించింది.
ఇరు వైపుల వాదనలు విన్న జడ్జి... ఈడీ కేసులోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి జూన్ 3న ఆమెను వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. కాగా, మార్చి 26 (మధ్యలో ఏప్రిల్ 11–14 వరకు సీబీఐ కస్టడీ మినహా) నుంచి కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
కరెన్సీ నంబర్లను టోకెన్లుగా వాడుకొని..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లను హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు టోకెన్ గా వాడుకున్నారని కోర్టు దృష్టికి ఈడీ తెచ్చింది. తద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను అక్రమ రూపంలో తరలించారని పేర్కొంది. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితతో పాటు మరో నలుగురిపై ఈ నెల 10న ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్‌షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై సోమవారం సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది.
ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో వివరాలను పొందుపరిచినట్లు ఈడీ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.కె.మట్ట, అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టుకు నివేదించారు. ఐదుగురు నిందితుల్లో కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ పాత్రపై సమగ్ర వివరాలు పొందుపరిచినట్లు చెప్పారు.
ఒక్కొక్కరికి సంబంధించి ప్రత్యేకంగా వివరాలు జోడించినట్లు తెలిపారు. అయితే తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధం కాగా.. జడ్జి కావేరి బవేజా ఇంట్రస్ట్ చూపించలేదు. కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్రను వివరించాలని ఈడీ తరఫు అడ్వకేట్లకు సూచించారు. దీంతో ప్రిన్స్ కుమార్ పాత్రను అడ్వకేట్ హుస్సేన్ వివరిస్తూ... ‘‘ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశాడు.
రూ. 100 కోట్ల అక్రమ మళ్లింపులో ఈయన పాత్ర కూడా ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా మూడు దశల్లో సుమారు రూ. 16 లక్షలు ( 6, 7, 3 లక్షల చొప్పున) ప్రిన్స్ కుమార్‌కు అందాయి” అని తెలిపారు. ఇందులో 3 కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లను టోకెన్ నంబర్ గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామన్నారు.
గోవాకు డబ్బులు మళ్లించడంలో అర్వింద్ సింగ్ కీలక పాత్ర
హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నంబర్లు వాడినట్లు కోర్టు దృష్టికి అడ్వకేట్ తీసుకెళ్లారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే... ఆ మూడు ఫోన్ నంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయని జడ్జి ప్రశ్నించారు. ఇందుకోసం కొంత టైం ఇవ్వాలని ఈడీ అడ్వకేట్లు కోరగా.. 15 నిమిషాల టైం ఇచ్చారు.
తిరిగి వాదనలు ప్రారంభం కాగానే.. సప్లమెంటరీ చార్జ్ షీట్ లోని పలు అంశాలపై ఈడీ అధికారులను జడ్జి కావేరి బవేజా వివరణ కోరారు. ఈ విషయంలో ఈడీ నుంచి పూర్తి వివరాలు అందకపోవడంతో... తాము కోరిన వివరాలతో మంగళవారం రావాలని జడ్జి సూచించారు. సప్లమెంటరీ చార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా.. కవిత సప్లమెంటరీ చార్జ్ షీట్ తర్వాత అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ పై దాఖలైన అనుబంధ చార్జ్ షీట్లను పరిగణనలోకి తీసుకునే అంశంపై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరపనుంది.
