వారి అనుబంధం గురించి ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పాలి: జైరాం రమేశ్

వారి అనుబంధం గురించి ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పాలి: జైరాం రమేశ్

న్యూఢిల్లీ: బీజేపీ, బీజేడీ కుమ్మక్కయ్యాయని కాం గ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. బీజేడీతో బీజేపీ అనుబంధం గురించి ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్​ జైరాం రమేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు. 'మహానది, కథాజోడి నదులను ఎందుకు విషపూరితం చేశారు? జీఎస్టీ ద్వారా ఒడిశాలోని పేదలు ఎందుకు దోపిడీకి గురవుతున్నారు? బీజేడీతో తన పార్టీ రిలేషన్ షిప్ గురించి ప్రధాని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? అని రమేశ్ ఎక్స్‌‌ లో పోస్ట్‌‌ ద్వారా ప్రశ్నించారు. 

మహానది, కథజోడి నదులలో భారీ ఆక్రమణలు, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. మురుగునీరు ప్రవహించడం వల్ల ఆ రెండు నదులు క్రమంగా కనుమరుగవుతాయని ఆయన ఆరోపించారు. 2019లో మహానదిని గంగానది తరహాలో శుద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి విస్మరించారని, గంగా నదిని కూడా ప్రక్షాళన చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ నియంత్రణలో ఉన్న కేంద్రం,  దాని బీ -టీమ్ రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా ఈ రెండు నదులను పూర్తిగా విషపూరితం చేయాలని చూస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌‌టీ దేశంలో అత్యంత దారుణంగా రూపొందించారని, దోపిడీ పన్ను నిర్మాణాలలో ఒకటి అని ఆరోపించారు.