హైదరాబాద్: రాసి పెట్టుకోండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా సీట్లతో అధికారంలోకి వస్తాం.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఇదే మా సవాల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని అధికారంలోకి రానివ్వనని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి అధికారం ఇక కల అని అన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ ఇక గతమేనని.. తెలంగాణ ఫ్యూచర్ ఇక కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత.. నేను నీకు భయపడతాని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుమ్ముంటే కోసుకోండి బిడ్డా.. రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు.
బుధవారం (డిసెంబర్ 24) నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై 180 మంది సర్పంచ్‌లు, 180 మంది ఉప సర్పంచ్‌లు, 1,739 మంది వార్డు సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతాం.. పార్టీ ఆఫీస్లో మాట్లాడుకోవడం కాదు.. అసెంబ్లీకి రావాలన్నారు.
►ALSO READ | నేను మాట్లాడితే.. నువ్వు రాయి కట్టుకుని మల్లన్న సాగర్ లో దూకుతావ్: కేసీఆర్ను దులిపేసిన సీఎం రేవంత్
అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి అవసరం ఉందన్నారు. మేం ప్రజల కోసం పని చేస్తున్నామని.. మా కాళ్లలో కట్టెలు పెట్టొద్దని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. కష్టం అంటే నాకు తెలుసని.. నాతో తమాషా వద్దని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రానికి పెద్దకొడుకుగా పని చేస్తున్నానని.. బీఆర్ఎస్ పదేండ్ల విధ్వంసాన్ని బాగు చేసేందుకు కొంచెం టైమ్ పడుతుందన్నారు.
