వడ్లకు బోనస్​పై మాట మార్చిన్రు: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

వడ్లకు బోనస్​పై మాట మార్చిన్రు: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ సర్కార్ మాట మార్చిందని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. అన్ని రకాల వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చిందన్నారు. దీంతో రైతుల ఆశలు అడియాసలు అయ్యాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, పది శాతమే సన్న వడ్లు పండిస్తారన్నారు. 

ఆ పది శాతం వడ్లకు మార్కెట్‌‌‌‌‌‌‌‌లోనే మంచి డిమాండ్ ఉంటుందని, మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుందన్నారు. దొడ్డు రకం వడ్లకు గిట్టుబాటు ధర కూడా రాదని, కాబట్టి వాటికే బోనస్ ఇవ్వాలన్నారు. అలా కాకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు దుయ్యబట్టారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.