- ఉన్నత ఉద్యోగాలు వదిలి పల్లె బాట
- ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటున్న కొత్త సర్పంచులు
- నేడు కొలువుదీరనున్న పంచాయతీల పాలకవర్గాలు
సంగారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఉన్నత చదువులు చదివిన విద్యావంతుల చేతుల్లోకి వెళ్లాయి. ఈసారి చాలామంది సర్పంచులు మొదటిసారి గెలిచి ఉత్తమ భావాలతో పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముందుకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి . అందులో మ్యాగ్జిమం కొత్తగా ఎన్నికైన సర్పంచులే ఉండగా సగం మంది పట్టభద్రులే ఉన్నారు. పల్లెలకు మంచి చేయాలన్న లక్ష్యంతో సోమవారం సర్పంచ్ లుగా బాధ్యతలు తీసుకోనున్నారు.
ఉన్నత ఉద్యోగాలు వదిలి గ్రామాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని కొందరు.. యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు చూపించి పల్లెల్లో విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు కల్పిస్తామని మరికొందరు అంటున్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని, అందుకు అవసరమైన ఫండ్స్ ప్రభుత్వం నుంచి తెప్పించుకోవడమే కాకుండా స్థానికంగా సమకూర్చుకుంటామని ఆదర్శంగా నిలుస్తున్నారు.
విద్యావంతులుగా తీర్చిదిద్దుతా
సర్పంచ్ గా ఎన్నికైన నేను ప్రతి పిల్లవాడిని స్కూల్కు పంపించేలా కార్యాచరణ రూపొందిస్తా. ఎంకామ్, బీఎడ్, ఎల్ఎల్ బీ చదివాను. విద్యాబోధనపై స్పెషల్ ఫోకస్ పెట్టి పిల్లలను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దుతా. గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉండేలా చూస్తా. సమస్య ఎంత పెద్దదైనా గ్రామంలోనే పరిష్కరిస్తా. పెద్దల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రధానంగా తాగునీటి సమస్య తోపాటు ఇతరత్రా సమస్యలు పరిష్కరిస్తా. - గొల్ల అశోక్, బోడపల్లి సర్పంచ్
డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయిస్తా
ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామంలో విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకొని వారికి ఉపయోగపడే విధంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తా. బీటెక్ చదివిన తాను ఉన్నత ఉద్యోగం ఆశించకుండాప్రజలకు ఏదైనా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తా. గ్రామంలో మహిళా గ్రూపు సభ్యులకు ఉపాధి అవకాశాలు చూపించి ఆదర్శ పంచాయతీగా నిలబెడతా. -బి. అమరేశ్వరి, జీర్లపల్లి సర్పంచ్
ప్రజా సేవ కోసమే..
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఎంఏ, బీఎడ్ చేసి ఉన్నత ఉద్యోగం వదిలి కంగ్టి సర్పంచ్ గా సేవలు అందించేందుకు ముందుకు వచ్చా. చిన్న పెద్ద అందరిని కలుపుకొని పోతూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తా. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల టైం లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తా. - మచ్కూరీ కృష్ణ, కంగ్టి సర్పంచ్
సొంత నిధులతో..
న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేసి ప్రజాసేవ కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేశా. గ్రామంలో తాగునీరు, మురికి కాల్వలు, వీధి దీపాలు, పాడైపోయిన బోర్లు, సీసీ రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా. లేదంటే సొంత ఫండ్స్ ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.- సుకుమార్, గంగ్వార్ సర్పంచ్
విద్యకే మొదటి ప్రాధాన్యం
సర్పంచ్ గా బాధ్యత తీసుకోబోతున్న నేను మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తా. చదువు ఉంటే ప్రతీ స్టూడెంట్ ఉన్నత విద్యావంతుడిగా ఎదుగుతారు. దీంతో భవిష్యత్లో గ్రామానికి మంచి చేయాలన్న ఆలోచన వారికి వస్తుంది. జన్మనిచ్చిన గ్రామాన్ని మరువకుండా ఎల్లప్పుడూ అభివృద్ధి చేసే అవకాశం ప్రతి ఒక్కరికీ వస్తుంది. స్కూల్ప్రహరీతో పాటు గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పిస్తా. అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. - ఎర్రోళ్ల నరేశ్ కుమార్, శంశోద్దీన్ పూర్ సర్పంచ్
