- జీపీల్లో జీరో బ్యాలెన్స్.. గుదిబండగా మారిన ట్రాక్టర్ల ఈఎంఐలు
- ఒక్కో సెక్రటరీకి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు బకాయిలు
గద్వాల, వెలుగు: గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులకు పెద్ద ఎత్తున సవాళ్లు ఎదురుకానున్నాయి. రెండేళ్ల నుంచి ఫండ్స్ రాకపోవడంతో ప్రస్తుతం అన్ని జీపీల్లో జీరో బ్యాలెన్స్ ఉంది. ఇదిలాఉంటే గత సర్కార్ హయాంలో చాలా గ్రామపంచాయతీల్లో ఆదాయం లేకపోయినా ట్రాక్టర్లను కొనుగోలు చేయడం గుదిబండగా మారింది. ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల నుంచి పంచాయతీలకు నిధులు రాకపోవడంతో వాటి మెయింటెనెన్స్ కోసం ఒక్కో సెక్రెటరీ రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేయగా, ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
అలాగే పాత సర్పంచుల హయాంలో చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేసి ఉన్నాయి. ఆ పనులకు కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో కొత్త సర్పంచులు ఏ చిన్న పని చేయాలన్న నిధుల కొరత తప్పేలా లేదు. ఫండ్స్ వచ్చినా పాత బకాయిలు చెల్లించాకే, కొత్త పనులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
పల్లెల్లో అన్నీ సమస్యలే..
ఫండ్స్ లేక పనులు చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. ఇంటర్నల్ రోడ్స్ దెబ్బతిన్నాయి. పైప్ లైన్ల లీకేజీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు కేవలం పారిశుధ్య కార్మికులకు మాత్రమే జీతాలు చెల్లిస్తూ వచ్చారు. ఫండ్స్ లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో 70 గ్రామపంచాయతీలకు బిల్డింగులు లేవు.
ఏ ఫండ్ రాలే..
గ్రామ పంచాయతీలకు రెండేళ్ల నుంచి తలసరి గ్రాంట్ రాలేదు. ప్రతి మనిషికి రూ.165 చొప్పున ప్రతి గ్రామపంచాయతీకి తలసరి గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. మూడు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదిలో నాలుగు సార్లు నిధులను రిలీజ్ చేస్తుంది. రెండేళ్ల నుంచి పీఎంఈవై, ఐఎఫ్ఎంఎస్, ఎస్ఎఫ్సీ, స్టేట్ గ్రాంట్ తదితర నిధులు రాకపోవడంతో పంచాయతీ పాలన గాడి తప్పింది. కొత్త సర్పంచులు వచ్చి వాటిని సరి చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొదట వచ్చే ఫండ్స్ ఇదివరకు చేసిన వాటికే కేటాయించాల్సి ఉండడంతో కొత్త సర్పంచులకు ఇబ్బంది తప్పదని అంటున్నారు.
ట్రాక్టర్ల ఈఎంఐలతో తిప్పలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకోవడానికి ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్లే గ్రామపంచాయతీలకు గుదిబండగా మారాయి. చిన్న గ్రామపంచాయతీలకు సైతం ట్రాక్టర్ కొనుగోలు చేయడంతో ఆ గ్రామానికి వచ్చే ఫండ్స్ మొత్తం ట్రాక్టర్ ఈఎంఐ చెల్లించేందుకే సరిపోతోంది. గద్వాల జిల్లాలోని 60 జీపీల ట్రాక్టర్లకు నెలలు తరబడి ఈఎంఐలు పెండింగ్ లో ఉన్నాయి. ట్రాక్టర్ల రిపేర్లు, ఈఎంఐలు, డీజిల్‌కు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.
సెక్రటరీలకే రూ.10 కోట్ల బిల్లుల పెండింగ్..
గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో సెక్రటరీలే గ్రామపంచాయతీల్లో పనులు చూసుకుంటున్నారు. రెండేళ్ల నుంచి పంచాయతీలకు ఫండ్స్ రాకపోవడంతో మెయింటెనెన్స్ కింద చేసిన పనులకు ఒక్కో సెక్రటరీ రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. ఇలా జిల్లాలోని 255 గ్రామపంచాయతీల సెక్రటరీలకు రూ.10 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు, పైప్ లైన్ల లీకేజీల రిపేర్లు, ట్రాక్టర్లకు డీజిల్, బ్లీచింగ్ పౌడర్, సున్నం తదితర వాటిని కొనుగోలు చేసేందుకు సెక్రటరీలు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. సర్పంచులు వచ్చాక వాటి చెల్లింపుల్లో లుకలుకలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
రెండేళ్ల నుంచి సెక్రెటరీలే ఖర్చుపెట్టిన్రు..
రెండేళ్ల నుంచి గ్రామపంచాయతీల్లో సెక్రటరీలే డబ్బులు ఖర్చుపెట్టారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. జిల్లాలో రూ.10 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు సెక్రటరీలకు ఇవ్వాల్సి ఉంది.– ఖాజా పాషా, జీపీ సెక్రటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు, గద్వాల
