- మూడేళ్లుగా కొనసాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే, కునారం ఆర్వోబీ పనులు
- కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా పరిధిలో నిర్మాణంలో ఉన్న పనుల్లో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే 163 పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు 2022లో ప్రారంభం కాగా ఇప్పటికీ సగంమేర కూడా పూర్తికాలేదు. భూసేకరణ విషయంలోనే లేట్ కాగా.. ఇప్పుడు నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరుగుతోంది. మరోవైపు కునారం ఆర్వోబీ పనులు కూడా స్లోగా సాగుతున్నాయి. బ్రిడ్జికి ఇరువైపుల భూసేకరణ పూర్తికాగా.. పనులు కంప్లీట్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్లయినా పూర్తి కాని పనులు
మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్ వెళ్లేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే 163ని కేంద్ర ప్రభుత్వం 2022లో మంజూరు చేసింది. ఈ హైవే నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 2,606 కోట్లుగా కేటాయించారు. 180 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డును 3 ప్యాకేజీలుగా విభజించి నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల మీదుగా జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల వరకు సాగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి 505 ఎకరాల భూమి సేకరించారు.
దాని కోసం రూ. 51.17 కోట్లు పరిహారంగా నిర్ణయించారు. పెద్దపల్లి–కునారం మధ్య ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. 2022లోనే ఈ పనులు కూడా స్టార్ట్ కాగా.. ఈ ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.119కోట్లు కేటాయించింది. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు రూ.21కోట్లు కేటాయించింది. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా.. పనుల్లో జాప్యంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిర్మాణాలు పూర్తయితే ట్రాన్స్‌పోర్ట్ ఈజీ
గ్రీన్‌ఫీల్డ్ హైవేతోపాటు కునారం ఆర్వోబీ పూర్తయితే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, వరంగల్జిల్లాల మధ్య దూరభారం తగ్గడంతోపాటు ట్రాన్స్‌పోర్ట్ ఈజీ కానుంది. మంచిర్యాల నుంచి ప్రారంభమయ్యే గ్రీన్‌ఫీల్డ్‌హైవే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో నుంచి భూపాలపల్లికి వెళ్తుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే మంచిర్యాల నుంచి ఖమ్మం జిల్లా వరకు కోల్ట్రాన్స్పోర్ట్ ఈజీ కానుంది.
పెద్దపల్లి నుంచి నిర్మాణం కానున్న హైవే.. పెద్దపల్లి కునారం వ్యవసాయ పరిశోధన కేంద్రం మీదుగా ముత్తారం ద్వారా భూపాలపల్లి– వరంగల్ వరకు వెళ్తుంది. ఇదేరోడ్డు పెద్దపల్లి నుంచి కునారం మీదుగా కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, హుజూరాబాద్ మీదుగా వరంగల్ చేరుకుంటుంది. కునారం వద్ద ఆర్వోబీ పూర్తయితే పెద్దపల్లి నుంచి వరంగల్‌కు వెళ్లడానికి రెండు హైవేలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి.
