సర్పంచులకు సమస్యల సవాళ్లు!.. రెండేండ్ల తర్వాత కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

సర్పంచులకు  సమస్యల సవాళ్లు!.. రెండేండ్ల తర్వాత కొలువుదీరనున్న  కొత్త పాలకవర్గాలు
  • పంచాయతీలను వెంటాడుతున్న నిధుల లేమి
  • కుక్కలు, కోతుల సమస్య, పారిశుధ్యం, వీధిలైట్లే ప్రధాన సమస్యలు

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  గ్రామ పంచాయతీల్లో ఇవాళ కొత్త పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. పాత పాలకవర్గాల సమయం ముగిసిన రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు బాధ్యతలు తీసుకోబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో 566, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 468 పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆయా పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీ సెక్రటరీలు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

కాగా, కొత్త పాలకవర్గాలకు కోతులు, కుక్కలు, పారిశుధ్యం, వీధిలైట్లు సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి.  పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతోంది. వచ్చే ఫండ్స్​ పంచాయతీలకు వాడుకోవాలా, పాత బిల్లులు చెల్లించాలో తెలియని పరిస్థితి నేలకొంది. కరెంట్ బిల్లులు, పంచాయతీ ట్రాక్టర్ల ఈఎంఐలు అలాగే పెండింగ్ పడ్డాయి.

ప్రధాన సమస్యలు ఇవే.. 

గ్రామాల్లో ప్రధానంగా కోతులతో పాటు కుక్కల బెడద తీవ్రంగా ఉంది. గుంపులుగా తిరుగుతూ, జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజూ ఏదో ఒక చోట దాడి చేసి పిల్లలు, పెద్దలను గాయపరుస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. 

రెండ్రోజుల కింద కల్లూరు మండలం చండ్రుపట్లలో జోనబోయిన కృష్ణయ్యకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడిచేయడంతో సుమారు 15 గొర్రెలు మృతిచెందాయి. దీంతో రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. 
 ఏడాది కాలంలో కారేపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని వేర్వేరు గ్రామాల్లో కుక్కల దాడుల్లో 40కి పైగా మేకలు, గొర్రెలు చనిపోయాయి. 

సత్తుపల్లి నీలాద్రి అర్బన్​ పార్క్​ నుంచి బయటకు వచ్చిన దుప్పులను కుక్కలు గాయపరిచిన ఘటనలు చాలానే ఉన్నాయి. 

పారిశుధ్యం, వీధిలైట్ల సమస్యలు వెంటాడుతున్నాయి. స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, రోడ్ల వెంబడి కంప చెట్లను నరకకపోవడం, డ్రైనేజీలను క్లీన్​ చేయకపోవడం, కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ల వెంబడి డ్రైనేజీలను ఏర్పాటు చేయకపోవడం లాంటి సమస్యలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీల్లో 196 పంచాయతీలకు మాత్రమే పక్కా బిల్డింగ్​లున్నాయి. 186 గ్రామపంచాయతీ ల బిల్డింగ్​లు నిర్మాణ దశలో ఉన్నాయి. పలు స్కూల్స్​, అంగన్​వాడీలతో పాటు అద్దె ఇండ్లలోనే పంచాయతీ ఆఫీసులు కొనసాగుతున్నాయి.  ఖమ్మం జిల్లాలోనూ తండాల నుంచి ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడిన చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. .ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నెన్నో హామీలిచ్చి వచ్చిన ప్రజా ప్రతినిధులకు, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కత్తిమీద సాములా మారనుందివెంటాడుతున్న నిధుల లేమి రెగ్యులర్​ సమస్యలకు తోడు, అదనంగా నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 

పలు చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్లు రిపేర్లకు వచ్చి మూలకు పడి ఉన్నాయి. రెండేండ్లుగా పంచాయతీల్లో ఎన్నికలు లేకపోవడంతో స్టేట్​తో పాటు సెంట్రల్​ ఫండ్స్​ నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో జిల్లాల్లో రెండేండ్ల కాలంలో దాదాపు రూ.50 కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయి. రూ. లక్షల్లో సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేశారు. కొత్తగా కొలువు దీరనున్న పాలకవర్గాలకు పాత బిల్లులు తలనొప్పిగా మారనున్నాయి. స్టేట్, సెంట్రల్​ నుంచి వచ్చే ఫండ్స్​తో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలా, పాత బిల్లులు చెల్లించాలా అనే చర్చ కొత్త ప్రజాప్రతినిధుల్లో జోరుగా సాగుతోంది. వచ్చిన డబ్బులు పాత బిల్లులకే ఇస్తే తాము అధికారంలోకి వచ్చి ఒక్క పనిచేయకపోతే ప్రజల్లో తమ పరిస్థితి ఏంటని కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. 

ఏర్పాట్లు పూర్తి ..

కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు గ్రామపంచాయతీ ఆఫీసుల్లో సెక్రటరీలు చేశారు. పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత జనరల్​ బాడీ మీటింగ్​  ఉంటుంది.     - సుధీర్​కుమార్​, డీపీఓ, భద్రాద్రికొత్తగూడెం