మేడారం జాతరకు రండి..రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించిన మంత్రులు

మేడారం జాతరకు రండి..రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: మేడారం మహా జాతరకు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమెను ప్రత్యేకంగా కలిసి ఇన్వైట్‌‌ చేశారు. ఈమేరకు అధికారిక ఆహ్వాన పత్రికను రాష్ట్రపతికి అందజేశారు. 

మేడారం జాతర సంప్రదాయాలకు అనుగుణంగా, సమ్మక్క తల్లి చీర, కంకణం, కండువ, బంగారాన్ని ముర్ముకు అందజేశారు. అనంతరం మేడారం జాతర ఘనత, ఆదివాసీ సంస్కృతిలో జాతరకున్న అపూర్వ స్థానం, సమ్మక్క సారక్క తల్లుల పోరాట చరిత్ర, వారి త్యాగం, ప్రజల విశ్వాసం, భక్తి, మేడారం అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్రపతికి మంత్రి సీతక్క వివరించారు. 

జాతరకు హాజరయ్యేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ప్రెసిడెంట్‌‌ ముర్ము తెలిపారు. జాతరకు ఆహ్వానించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. మంత్రులకు నూతన వస్త్రాలను బహూకరించి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.