- ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ పోస్టుల భర్తీకి భారీగా అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్‌లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 60 పోస్టులకు 4,665 (2,500 మంది పురుషులు, 2,165 మంది మహిళలు) మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీజీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అంటెండెంట్ కలిపి మొత్తం 60 పోస్టుల భర్తీకి టీజీఎల్‌పీఆర్‌బీ నంబర్ 14న నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా, దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు జనవరి 20 నుంచి 31 వరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు.
అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌లు తీసుకుని రావాలని సూచించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పోస్టుల వారీగా ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
