ధరణి కష్టాలను తప్పించినం..గతంలో దొరల గడీల్లో భూ రికార్డులు బందీ: మంత్రి పొంగులేటి 

ధరణి కష్టాలను తప్పించినం..గతంలో దొరల గడీల్లో భూ రికార్డులు బందీ: మంత్రి పొంగులేటి 
  • నాటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నాటకాలకు చెక్ పెట్టాం
  • ఇప్పుడు పేదల అకౌంట్లోనే ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు పడుతున్నాయని కామెంట్​
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజా దర్బార్

సత్తుపల్లి, వెలుగు: ‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌ లోపాల వల్ల పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాడు గడీల్లో బందీ అయిన భూ రికార్డులను విడిపించి, భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం’ అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించి ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ధనిక తెలంగాణను బీఆర్ఎస్​ పాలకులు అప్పుల కుప్పగా మార్చారని, రూ.8 లక్షల 18 వేల కోట్ల అప్పు చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. అప్పులు ఉన్నా తమ ప్రభుత్వం పేదలకు భద్రత, భరోసా కల్పిస్తున్నదన్నారు.

గతంలో ఎన్నికలు రాగానే డబుల్​ బెడ్​రూమ్‌ ఇండ్ల పేరుతో బొమ్మలు చూపించి మోసగించారని, తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పటికే 1.25 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి మరో లక్ష ఇండ్లు సిద్ధమవుతాయన్నారు.

జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తారని ప్రకటించారు. ములకలపల్లి క్వారీ నుంచి ఇసుకను ఉచితంగా అందిస్తామని చెప్పారు. రెండేండ్లలోనే తమ ప్రభుత్వం 72 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, త్వరలోనే మరో కొత్త కొలువుల ప్రకటన రాబోతున్నదన్నారు. 

కాలపరిమితిలోగా భూముల కొలతలు.. పహాణీల్లో పేర్లు

సత్తుపల్లిలోని 399 సర్వే నంబర్ తో పాటు మరో 9 గ్రామాల్లోని దాదాపు 6,500 ఎకరాల భూ సమస్య పరిష్కారం విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారు. పెద్దపల్లి, నారాయణపురంలో 5,500 ఎకరాలకు సంబంధించి సర్వే చేసి అర్హులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించారు. రుద్రాక్షపల్లి, కొండ్రుపాడు, తాళ్లపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా సరిహద్దుల్లోని 10, 12 గ్రామాల్లో అటవీ, రెవెన్యూ భూముల వివాదాలపై మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే అటవీ సరిహద్దులను తేల్చాలన్నారు.

మిగిలిన రెవెన్యూ భూమిని చాలాకాలంగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు వేసుకుంటున్న బోర్లకు అటవీ అధికారులు అభ్యంతరాలు పెట్టవద్దని అన్నారు. కార్యక్రమంలో టీజీఐడీసీ చైర్మన్ మువ్వ విజయ బాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్, కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్ డీఓ మంజుల, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీసీహెచ్ ఎస్ రాజశేఖర్ గౌడ్, సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.