ఎంఎస్పీకి  భరోసా ఇవ్వాలి.. ఎల్ నినో సాయానికి స్పెషల్ ఫండ్ పెట్టండి: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

ఎంఎస్పీకి  భరోసా ఇవ్వాలి.. ఎల్ నినో సాయానికి స్పెషల్ ఫండ్ పెట్టండి: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
  •     రాష్ట్రాల మధ్య విధానాల మార్పిడి అవసరం
  •     క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని పునః పరిశీలించండి
  •     సదరన్‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో మంత్రి తుమ్మల  


 
హైదరాబాద్, వెలుగు: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో బాధ్యత వహించాలని కేంద్రాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.  సదరన్‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో ఆయన పాల్గొని రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మద్దతు ధర కంటే ధరలు తగ్గితే కేంద్రం–రాష్ట్రాలు కలిసి రైతులను ఆదుకోవాలన్నారు. 
 

మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌ కింద నాఫెడ్‌ వంటి కేంద్ర సంస్థల ద్వారా సమర్థంగా కొనుగోలు చేయాలని సూచించారు. మార్కెట్‌ ధరలు ఎంఎస్‌పీ కంటే తగ్గినప్పుడు ప్రస్తుతం ఉన్న 25 శాతం పీఎస్‌ఎస్‌ పరిమితిని సడలించి, తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలు అదనంగా చేపట్టే కొనుగోళ్ల ఖర్చులో కేంద్రం భాగస్వామి కావాలని కోరారు. ఎంఎస్‌పీ కంటే మార్కెట్‌ ధరలు తగ్గిన సందర్భాల్లో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంటల కొనుగోళ్లు చేపడుతోందని తుమ్మల తెలిపారు.

మక్కజొన్నకు సుమారు రూ.6 వేల కోట్లు, జొన్నకు రూ.1,100 కోట్లకు పైగా విలువైన కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని చెబుతూ   రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాల అమలులో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను సదస్సులో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్‌ సేల్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) ను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తుమ్మల తెలిపారు. యూరియా యాప్‌ ద్వారా ఎరువుల పంపిణీలో సాధించిన విజయాన్ని ఎఫ్‌ఎఫ్‌ఎస్‌లోనూ కొనసాగిస్తామని చెప్పారు. వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని తుమ్మల అన్నారు. ‘ఎల్‌నినో అసిస్టెన్స్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. సూక్ష్మ సేద్యం, నీటి పొదుపు చర్యలకు కేంద్రం మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాల మధ్య విధానాల మార్పిడి

వ్యవసాయ రంగంలో విజయవంతమైన విధానాలను రాష్ట్రాలు పరస్పరం పంచుకోవాలని తుమ్మల పిలుపునిచ్చారు. తెలంగాణలోని మంచి విధానాలను ఇతర రాష్ట్రాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇతర రాష్ట్రాల విజయవంతమైన నమూనాలను నేర్చుకునేందుకు సిద్ధమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని, రైతుల సాధికారతతో పాటు వికసిత్‌ తెలంగాణ–2047, వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యాల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

రూ.35,839 కోట్లు రైతు భరోసా

రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రూ.35,839 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. 2026 వానాకాలంలో కేవలం తొమ్మిది రోజుల్లోనే 70.40 లక్షల పట్టాదారులకు రూ.8,759 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని తుమ్మల తెలిపారు. దాదాపు 25 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు సుమారు రూ.21 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. గత మూడేండ్లలో రైతు బీమా ప్రీమియంగా రూ.3,531 కోట్లు చెల్లించామని, 42 లక్షలకు పైగా రైతులకు బీమా సౌకర్యం కల్పించామని వివరించారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. అదనంగా దాదాపు లక్ష హెక్టార్లను ఆయిల్‌పామ్‌ సాగులోకి తీసుకురాగా, 72 వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఆయిల్‌పామ్‌ గెలలకు (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 

రైతు నేస్తం సేవలను ప్రశంసించిన కేంద్ర మంత్రి.. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని కేంద్ర  మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు నిపుణుల సలహాలను నేరుగా చేరవేసే ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇదే సందర్భంగా రైతు నేస్తం 100 ఎపిసోడ్ల పూర్తి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్‌ బుక్‌ను కేంద్ర మంత్రి చౌహాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ నమూనాను పలువురు ప్రతినిధులు ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భగీరథ్‌ చౌదరీ, దక్షిణాది రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.