అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పెద్దపల్లిలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం ( ఏప్రిల్ 14 ) పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తుందని అన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయని..దేశానికి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారని అన్నారు. కార్మికులకు ఎనిమిది గంటల పని దినంతో పాటు అనేక హక్కులను రాజ్యాంగంలో రూపొందించారని అన్నారు మంత్రి వివేక్. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థను కాపాడి లక్షల మంది కార్మికులకు ఉపాధిని కల్పించారని అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం మహాత్మా గాంధీతో సైతం కొట్లాడి హక్కులను సాధించారని..మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. అప్పుడు ఉన్న యూపీఏ ప్రభుత్వంలో మెజార్టీ లేక అది సాధ్యం కాలేదని..ఈనెల 16న పార్లమెంటులో ప్రవేశపెట్టే మహిళా రిజర్వేషన్ కు కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు మంత్రి వివేక్.
తెలంగాణ రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలు తన సొంతంగా డొనేట్ చేయడం జరిగిందని..అంబేద్కర్ విగ్రహాలు డొనేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.అంబేద్కర్ దళితులకు ఒక స్ఫూర్తి అని , దళితుల కోసం చాలా కష్టపడి హక్కులు కల్పించేలా రాజ్యాంగం రూపొందించారని అన్నారు మంత్రి వివేక్.

