- పెద్దపల్లిలోనూ కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు: వివేక్ వెంకటస్వామి
- ఏఐసీసీ చీఫ్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో మంత్రి, ఎంపీ వంశీకృష్ణ భేటీ
- వివేక్ వల్లే మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు ఇలాకా అయిన మెదక్ లో తాను ఇంచార్జీ మంత్రిగా కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఇచ్చామని మంత్రి వివేక్ వెంకట స్వామి చెప్పారు. మెదక్ లో తాము మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామని పార్టీ హైకమాండ్ కు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ భారీ సీట్లను గెలుచుకోనుందన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ అంశాలతో పాటు చెన్నూరు, పెద్దపల్లి పరిధిలో పార్టీ బలపడుతున్న తీరును మంత్రి వివరించారు. ప్రధానంగా పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చడంతో పాటూ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడంలో తాను చేస్తోన్న ప్రయత్నాలను తెలిపారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కు తాను ఇంచార్జ్ గా వ్యవహరించానని, పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని గుర్తు చేశారు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో మెదక్ ఇంచార్జ్ మంత్రిగా ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపారు.
అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ కు మెదక్ నియోజక వర్గం నుంచి ఎక్కువ స్థానాలు రానున్నట్లు సర్వేల్లో తేలిందని వివరించారు. అలాగే పెద్దపల్లి నియోజక వర్గంలోనూ పార్టీకి మంచి ఫలితాలు రానున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ పథకాల అమలుతో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వివరించారు. అయితే, పెద్దపల్లిలో బలమైన 10 మంది అభ్యర్థులకు పార్టీ బీ ఫాంలు ఇవ్వలేకపోయిందని కేసీ దృష్టికి ఎంపీ వంశీకృష్ణ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని.. ఇలాంటి పరిణామాలతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి, గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రజల్లో పేరున్న నేతలకు అవకాశం కల్పించకపోవడం వల్ల, వారు రెబల్స్ గా పోటీ చేసే పరిస్థితి నెలకొందని వివరించారు. ఇలాంటి విషయాల్లో పార్టీ అధిష్టానం ఫోకస్ చేయాలని కోరారు.
వివేక్ తోనే సాధ్యమైంది. .
మెదక్ పార్లమెంట్ నియోజక వర్గానికి ఇంచార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో కాంగ్రెస్ కు మెరుగైన సీట్లు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు తెలిపారు. ముఖ్యంగా మామ, అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్) ఇలాకాలు గజ్వెల్, సిద్దిపేటలో పార్టీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ ముగిసి వెళ్తున్న టైంలోనే.. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి కేసీ నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగి.. మంత్రి వివేక్ తో కలిసి కాసేపు మున్సిపల్ ఎన్నికల అంశాలపై కేసీతో మాట్లాడారు. మెదక్ ఇంచార్జ్ గా ఉన్న మంత్రి వివేక్ తోనే ఇటీవల లోకల్ బాడీ, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధనలో వివేక్ కృషి, పోరాటంతోనే ఇది సాధ్యమైందన్నారు. వివేక్ కాకుండా, ఇతర మంత్రులకు మెదక్ బాధ్యతలు అప్పగించి ఉంటే ఫలితాల్లో మార్పులు వచ్చేవని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడంలో మంత్రి వివేక్ కృషి కీలకమైందన్నారు. కాగా, సీఎం, మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ మధ్య ఈ సందర్భంగా సరదా సంభాషణలు జరిగాయి.
