ప్రాజెక్టులను పండబెట్టి.. ఇప్పుడు పాదయాత్రలా? : మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి

ప్రాజెక్టులను పండబెట్టి.. ఇప్పుడు పాదయాత్రలా? : మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి
  • పాలమూరు-రంగారెడ్డిని రెండేండ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఏడబోయారు?
  • మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్​వి మతిలేని మాటలు 
  • రూ.వేల కోట్లు దోచుకుని  ఇప్పుడు చిలుకపలుకులా?
  • బీఆర్ఎస్ నేతలపై మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి ఫైర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్లపాటు అధికారంలో ఉండి కూడా మహబూబ్​నగర్ జిల్లాలోని పాల మూరు–రంగారెడ్డి సహా అన్ని ప్రాజెక్టులను బీఆర్ఎ స్ నేతలు పండబెట్టారని మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. ఇప్పుడు ప్రాజె క్టుల కోసం పాదయాత్రలు చేస్తామనడం వారి కుటిల రాజకీయాలకు నిదర్శనమని, ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నవారే ఇప్పుడు చిలుకపలుకులు పలుకుతున్నారని విమర్శించారు. మంగళవారం సీఎల్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రులు జూపల్లి, వాకిటి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రాజెక్టుల కోసం నార్లాపూర్  నుంచి ఉద్దండాపూర్  వ‌ర‌కు పాద‌యాత్ర చేస్తామ‌ని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా బీఆర్ఎస్  నేతలు, మాజీ మంత్రులు ప్రకటించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టుల దుస్థితికి కారణమైన బీఆర్ఎస్  నేతల‌కు పాద‌యాత్ర చేసే నైతిక హ‌క్కు లేదన్నారు. వారురు చెప్తున్నట్లు రాష్ట్రాన్ని అంత గొప్పగా ప‌రిపాలిస్తే ఎందుకు ప్రజ‌ల విశ్వాసం కోల్పోయారని ప్రశ్నించారు. పాల‌మూరుతో పాటు అన్ని పెండింగ్  ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి తమకు హామీ ఇచ్చారని చెప్పారు. పాల‌మూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద తాను కుర్చీ వేసుకుని కూర్చొని రెండేళ్లలో పూర్తిచేస్తానని మాజీ సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారని, పదేండ్లయినా పూర్తిచేయలేదని మంత్రి జూపల్లి విమర్శించారు.

ప్రాజెక్టుల పేరుతో రూ. 8 ల‌క్షల కోట్లు అప్పుచేసిన కేసీఆర్​ సర్కారు.. పాల‌మూరుకు రూ.25 వేల కోట్లు మాత్రమే కేటాయించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని నిలదీశారు. మెయిన్  కెనాల్స్ , డిస్టిబ్యూట‌రీ పనుల ఊసేలేదన్నారు. ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డి, కేసీఆర్ కు  భ‌య‌ప‌డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్  నేతలు ఆ ప్రాజెక్టుల గురించి అడగనేలేదని ఆరోపించారు. క‌ల్వకుర్తి, నెట్టెంపాడు , కోయిల్ సాగ‌ర్  వంటి ప్రాజెక్టుల‌పై బీఆర్ఎస్  హయాంలో రూ.6,300 కోట్లు మాత్రమే ఖ‌ర్చుచేశారని, అందుకే ఆయకట్టుకు నీళ్లు అందడం లేదన్నారు.  

కృష్ణా జలాల్లో వాటా ఆంధ్రాకు తాకట్టు

కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటాను నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం ఆంధ్రాకు తాక‌ట్టు పెట్టిందని మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ‘‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణ‌కు చాలని కేసీఆర్, హ‌రీశ్​రావు సంత‌కాలు పెట్టి వ‌చ్చారు. తమ ప్రభుత్వం కృష్ణా జ‌లాల్లో 560 టీఎంసీలను వినియోగించుకునే హ‌క్కు కోసం వాదిస్తోందని పాల‌మూరుపై కేసీఆర్  స‌వతి త‌ల్లి ప్రేమ చూపాడు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ వేల టీఎంసీల నీళ్లను తీసుకుపోతోంది. దాన్ని అడ్డుకోలేని  బీఆర్ఎస్  నేతలు ఇప్పుడు ప్రాజెక్టుల కోసం పాదయాత్ర​చేస్తామంటే  ఎవరు నమ్ముతారు?” అని కడియం ప్రశ్నించారు.