‘ఎమ్మెల్యేల పేర్లు రావొద్దని.. సీఎం పోలీసులకు చెప్పారా?’

‘ఎమ్మెల్యేల పేర్లు రావొద్దని.. సీఎం పోలీసులకు చెప్పారా?’

సంగారెడ్డి: తెలంగాణలో హత్య రాజకీయం మొదలైందని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే హ‌త్య‌లు చేస్తున్నార‌ని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. లాయ‌ర్ దంప‌తుల హ‌త్య వెనుక కుట్ర ఏంటో టీఆర్ఎస్ నాయ‌కులు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ లో వున్న ముఖ్యమంత్రి ఈ హత్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నిస్తూ.. పోలీస్ వాళ్ళు ఈ కేసు విష‌యాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని నిల‌దీశారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ల పేర్లు రాకుండా చూడమని పోలీసుల‌కు చెప్పారని అనుమానం వ‌స్తుంద‌ని అన్నారు.

మీరే హత్యలు చేపిస్తరు మీరే మాకు సంబంధం లేదని అంటున్నారు. తండ్రి కొడుకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడ‌డంతో.. కార్యకర్తలు దీన్ని ఆసరాగా చేసుకునే హత్యలు చేస్తున్నారని రాజాసింగ్ విమ‌ర్శించారు. న్యాయవాదుల హత్యలో ముఖ్యమంత్రిపై , ఆయన కొడుకు పై ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కూడా కేసు నమోదు చెయ్యాలని అన్నారు.

తెలంగాణ ప్రజలు మేల్కుంటున్నార‌ని,  ఈ హ‌త్య కేసులో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా వున్నట్లు జనాలు అనుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత మొదలైందని చెప్పారు. నాగార్జున సాగర్ లో ఎన్నికల్లో హత్యలు చేసే పార్టీని గెలిపిస్తారా? లేదంటే మీకు రక్షణకోసం ఉండే బీజేపీ నీ గెలిపిస్తారో మీరే తేల్చుకోవాల‌ని అన్నారు రాజ‌సింగ్.