దక్షిణాన బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఉత్తరాన సీట్లు పెంచుకొని మరోసారి అధికారం చేపట్టాలని డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర చేస్తోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. డీలిమిటేషన్ద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయంగా జరగాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లాలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, ధర్మారం, గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుల్తానాబాద్, మంథని పట్టణాల్లోని కాకా విగ్రహాలకు, మంథనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. పెద్దపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన డీలిమిటేషన్ పై అవగాహన ర్యాలీలో ఎంపీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని పాల్గొన్నారు.
బీజేపీ సొంతలాభం కోసం డీలిమిటేషన్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిపై పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు. అమరావతికి 5 లక్షల కోట్లు నిధులు ఇస్తున్న కేంద్రం మనకు హక్కుగా రావలసిన నిధులను ఆపేస్తుందని, రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ను ఫైనల్ స్టేజ్ లో నిలిపివేశారని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, మాజీ స్పీకర్ శ్రీపాద రావు అడుగుజాడల్లో నడుస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంథనిలో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదారావు 27వ వర్థంతి సందర్బంగా మంథనిలోని శ్రీపాద రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు అన్ని వర్గాలకు అండగా ఉంటూ సేవలందించారని కొనియాడారు. శ్రీపాద రావు, కాకా వెంకటస్వామి మధ్య మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అంతటి అన్నయ్యగౌడ్, సయ్యద్ సజ్జాద్, పి. మల్లికార్జున్, కాడే సూర్యనారాయణ, బొంకూరి సన్నీ, తాండ్ర సదానందం, బండారు సునీల్, మైస రాజేశ్, గోవర్ధన్ రెడ్డి, కామ విజయ్, కోటేశ్వర్లు, మధు తదితరులు పాల్గొన్నారు.

