అంబానీకి మస్త్ కలిసొచ్చి సంపద భారీగా పెరిగింది

అంబానీకి మస్త్ కలిసొచ్చి సంపద భారీగా పెరిగింది

న్యూఢిల్లీ : బిలీనియర్ ముకేశ్ అంబానీకి ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద  భారీగా పెరిగింది. ఈ నెల 23 వరకు ముకేశ్ అంబానీ ఈ ఏడాది 17 బిలియన్ డాలర్ల(రూ.1,21,151 కోట్ల) సంపద పెంచుకున్నారు. దీంతో మొత్తంగా ముకేశ్ సంపద 61 బిలియన్ డాలర్లకు(రూ.4,34,719 కోట్లు) పెరిగినట్టు బ్లూమ్‌‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌‌లో వెల్లడైంది.  ఇదే సమయంలో అలీబాబా గ్రూప్ ఫౌండర్‌‌‌‌ జాక్‌‌మా నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు(రూ.80,541 కోట్లు) పెరగగా.. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 13.2 బిలియన్ డాలర్లు(రూ.94,063 కోట్లు)  సంపద పోగొట్టుకున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు బాగా పెరగడంతో, అంబానీ సంపద కూడా ఈ ఏడాది 40 శాతం మేర పెరిగింది. ఆయిల్ రిఫైనింగ్ నుంచి టెలికాం వరకున్న వ్యాపారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌‌లో దూసుకుపోతోంది. ఇండియా బెంచ్‌‌మార్క్ బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌ కంటే రెండింతలు ఎక్కువగా రిలయన్స్ స్టాక్ ర్యాలీ చేసింది. గత మూడేళ్లుగా టెలికాం వ్యాపారాల్లో సంచలనం సృష్టించిన ముకేశ్.. తాజాగా ఆన్‌‌లైన్ వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. అమెజాన్.కామ్ లాంటి ఈకామర్స్ కంపెనీలకు ఇండియాలో పోటీగా నిలిచేందుకు లోకల్ ఈకామర్స్ కంపెనీని స్థాపించబోతున్నారు.

కొత్త వ్యాపారాల నుంచి కోట్లు…

ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే కాక, టెలికాం, రిటైల్‌‌ అనే స్థాయికి నిలబెట్టారని టీసీజీ అసెట్ మేనేజ్‌‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఆఫీసర్ చక్రి లోకప్రియ చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో ఈ కంపెనీ షేర్‌‌‌‌హోల్డర్ వాల్యు డబుల్ అవనుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. గత కొన్నేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కు పాత వ్యాపారాల నుంచి ఆదాయాలు కాస్త తగ్గి, కొత్త వ్యాపారాల నుంచి కోట్లు వస్తున్నాయి. ఈ కొత్త వ్యాపారాలే మరికొన్నేళ్లలో మొత్తం రిలయన్స్ ఆదాయాల్లో50 శాతం ఉండనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ఇవి 32 శాతం వరకు ఉన్నాయి.