శ్రీలంకలో 8వ బ్లాస్ట్ : 166కి పెరిగిన మృతుల సంఖ్య

శ్రీలంకలో 8వ బ్లాస్ట్ : 166కి పెరిగిన మృతుల సంఖ్య

ఈస్టర్ సండే ప్రార్థనల్లో ముష్కర మారణహోమం

బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న కొలంబో

ఈ మధ్యాహ్నం 8వ బ్లాస్ట్

166కు పెరిగిన మృతుల సంఖ్య

శ్రీలంక అంతటా హై అలర్ట్

ఈస్టర్ పండుగనాడే ఉగ్రవాదులు శ్రీలంకలో మారణ హోమం సృష్టించారు. ఈ ఉదయం కొలంబోలోని పలు చర్చిలు… పలు ఖరీదైన ప్రఖ్యాత హోటళ్లలో పేలుళ్లకు తెగబడ్డారు టెర్రరిస్టులు. ఈస్టర్ ఆదివారం సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీగా క్రైస్తవులు వస్తారన్న అంచనాతో… ముందస్తు ప్రణాళిక ప్రకారం టెర్రరిస్టులు ఈ దాడి చేసినట్టుగా శ్రీలంక పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఉదయం 8.45 వరుసగా 3 ప్రార్థనా మందిరాలు, 3 ప్రధాన హోటళ్లలో ఆరుసార్లు బాంబు పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ మధ్యాహ్నం మరో రెండు పేలుళ్లు జరిగాయని వివరించారు.

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ మధ్యాహ్నం మరో రెండు ప్రాంతాలలో పేలుళ్లు జరిగాయి. కొలంబో దగ్గర్లోని దెహివెలాలో జరిగిన పేలుళ్లలో ఇద్దరు చనిపోయారు. కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 166కి పెరిగిందని పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఉగ్రవాదుల మారణకాండలో 500మందికి పైగా జనం గాయపడ్డారని సమాచారం. ఇప్పటికే కొలంబో సహా.. శ్రీలంకలో దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్లన్నీ రాజధాని కొలంబోలోనే జరిగినట్టు వివరించారు. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల వెనుక ఆత్మాహుతి దళాల పాత్ర ఉందని శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇప్పటికే సైన్యాన్ని రంగంలోకి దింపింది.