రీల్స్ చేయండి..  బహుమతులు పొందండి..ములుగు జిల్లా పర్యాటక వైభవంపై (నేటి మే 21)నుంచి రీల్స్ కాంటెస్ట్ 

రీల్స్ చేయండి..  బహుమతులు పొందండి..ములుగు జిల్లా పర్యాటక వైభవంపై (నేటి మే 21)నుంచి రీల్స్ కాంటెస్ట్ 
  • వీడియోలు పంపండి: కలెక్టర్ హేమంత్​ 

హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాలోని అడవి అందాలు, జలపాతాలు, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. కలెక్టర్ హేమంత్ బోర్ఖడే నేతృత్వంలో సరికొత్త పర్యాటక ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు, వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా రీల్స్ పోటీ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రామప్ప, లక్నవరం, సమ్మక్క, -సారలమ్మ గద్దెలు, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రదేశాలతోపాటు గిరిజన సంప్రదాయాలు, స్థానిక ఆహార వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా రీల్స్ రూపొందించాలి.

గురువారం నుంచి ఈ నెల 30 వరకు ఈ పోటీలు జరుగుతాయి. అత్యుత్తమ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జిల్లా అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రదర్శించడంతోపాటు విజేతలకు భారీ నగదు బహుమతులు అందించనున్నారు. ప్రథమ బహుమతి రూ.21 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.11 వేలు ఇవ్వనున్నారు.  పర్యాటక అభివృద్ధిలో స్థానిక గిరిజన యువతను భాగస్వాములను చేస్తూ గిరి దర్శక్ అనే వినూత్న ప్రోగ్రామ్ చేపట్టారు.

వాజేడు, వెంకటాపురం మండలాల్లోని యువతకు కర్రెగుట్టల హిల్స్ వంటి ప్రాంతాల్లో గైడ్లుగా శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల పర్యాటకులకు సరైన సమాచారం అందడంతోపాటు గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. యువత, ఫొటోగ్రాఫర్లు ములుగు జిల్లా పర్యాటకంపై రూపొందించిన తమ వీడియోలను పంపాలన్నారు. పూర్తి వివరాలకు 99483 92976, 94949 70535 ఫోన్​నంబర్లలో సంప్రదించాలని సూచించారు.