మళ్లీ నర్సు యూనిఫాం వేసుకున్న మేయర్

మళ్లీ నర్సు యూనిఫాం వేసుకున్న మేయర్

కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. దీంతో  ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరోవైపు వైరస్ బారిన పడిన వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. ఇందులో భాగంగానే కరోనా రోగులకు సాయం చేసేందుకు ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ మళ్లీ నర్సు యూనిఫామ్ వేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నర్సుగా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్య సిబ్బందిలో స్ఫూర్తి నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాత్రివేళ షిఫ్టులలో ఆమె పనిచేయనున్నట్టు శివసేన పార్టీకి చెందని ఓ నాయకుడు తెలిపారు.

ముంబై కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని తెలిపారు మేయర్ కిషోరి పడ్నేకర్. మేము ఇంటి దగ్గర్నుంచి పనిచేయలేం. బయట మీకోసం మేమున్నాం… మీరు ఇళ్లలోనే ఉండండి.. క్షేమంగా ఉండండి అంటూ ట్విట్టర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సంబంధించి బీవైఎల్ నాయర్ ఆస్పత్రి, సియాన్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందితో మేయర్ మాట్లాడారు.

ముంబై మేయర్ కాక ముందు కిషోరి పడ్నేకర్ ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 2 గంటల వరకు పని చేసేవారు. ఇప్పుడు నగరంలోని నాయర్ ఆస్పత్రిలో సేవలు అందించేందుకు మళ్లీ నర్స్ యూనిఫాం ధరించారు.