కుర్మిద్ద అటవీ ప్రాంతంలో ఆటో డ్రైవర్ మర్డర్ కేసును ఛేదించిన యాచారం పోలీసులు ..జులై 21న ఘటన..నిందితుడు అరెస్ట్
ఇబ్రహీంపట్నం,వెలుగు: కుర్మిద్ద అటవీ ప్రాంతంలో జులై 21న హత్యకు గురైన ఆటో డ్రైవర్ కేసును యాచారం పోలీసుల ఛేదించారు. ఆటోడ్రైవర్ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తే అతడిని చంపినట్టు తేల్చిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మీడియా సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి వెల్లడించారు. ఎల్ బీనగర్ పరిధిలోని శివమ్మనగర్ లో ఉండే కిట్టిగౌరి రవి(33) ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. కడ్తాల మండలం పల్లె చెల్కతండా గ్రామానికి చెందిన జర్పుల బిచ్యానాయక్(40) ఎల్ బీనగర్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ లో ఉంటూ ఆటోడ్రైవర్ గా పనిచేసేవాడు. రవి, బిచ్యానాయక్ పక్క పక్క వీధుల్లో ఉండటంతో పాటు ఇద్దరూ ఆటోడ్రైవర్లు కావడంతో వారికి పరిచయం ఏర్పడింది. దీంతో 3 నెలల క్రితం బిచ్యానాయక్.. రవి దగ్గర రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత తీసుకున్న డబ్బు ఇవ్వాలని రవి..బిచ్యానాయక్ ని అడిగాడు. బిచ్యానాయక్ డబ్బు ఇవ్వకుండా రవిని తిప్పించుకోసాగాడు. అప్పు తీర్చమని అడుగుతున్న రవిని చంపాలని బిచ్యానాయక్ ప్లాన్ వేశాడు. జులై 21న అర్ధరాత్రి ప్లాన్ ప్రకారం ఆటోలో రవిని తీసుకెళ్లిన బిచ్యానాయక్ అతడికి మద్యం తాగించాడు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అతడి తలపై కొట్టి తాడును మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. రవి చనిపోయినట్టు నిర్దారించుకున్న బిచ్యానాయక్ డెడ్ బాడీని యాచారం మండలం కుర్మిద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆటోను చంద్రయాణగుట్టలోని గ్యారేజీలో పెట్టిన బిచ్యానాయక్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ లోగా రవి భార్య సుస్మిత జులై 21 నుంచి తన భర్త కనిపించడ లేదని ఎల్ బీనగర్ పీఎస్ లో కంప్లయింట్ చేసింది.
తన భర్త రవి..బిచ్యానాయక్ కి రూ.3లక్షలు అప్పుగా ఇచ్చాడని సుస్మిత కంప్లయింట్ లో పేర్కొంది. రవి జులై 15న బిచ్యానాయక్ ని కలవడానికి వెళ్లి బ్యాంకు పాస్ బుక్, చెక్ బుక్ పొగొట్టుకుని వచ్చాడని..రవి మిస్సింగ్ కి బిచ్యానాయక్ పై అనుమానం ఉందని సుస్మిత ఎల్ బీనగర్ పోలీసులకు చెప్పింది. మరో వైపు జులై 23న కుర్మిద్ద అటవీ ప్రాంతంలో కాలిపోయిన ఓ డెడ్ బాడీని చూసిన మేకల కాపర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చనిపోయిన వ్యక్తి ఎల్ బీనగర్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ అయిన ఆటోడ్రైవర్ రవిగా గుర్తించారు. రవి భార్య సుస్మితను విచారించి వివరాలు తెలుసుకున్నారు. అనుమానితుడు బిచ్యానాయక్ ని కడ్తాల మండలంలోని అతడి సొంతూరు పల్లె చెల్కతండాలో యాచారం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు.
తీసుకున్న డబ్బులు ఇవ్వమని రవి ఒత్తిడి చేసినందుకే హత్య చేసినట్టు విచారణలో బిచ్యానాయక్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. జులై 15నే రవికి చంపేందుకు ప్లాన్ వేసి విఫలమయ్యానని..21వ తేదీ అతడిని చంపి పెట్రోల్ పోసి తగులపెట్టానని బిచ్యానాయక్ పోలీసులకు వివరాలు చెప్పాడు. నిందితుడు బిచ్యానాయక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని రిమాండ్ కి తరలించారు. ఈ కేసును ఛేదించిన యాచారం సీఐ మధుకుమార్, ఎస్ఐ వెంకటయ్య, సిబ్బందిని ఏసీపీ యాదగిరి రెడ్డి అభినందించారు.

చనిపోయిన రవి (ఫైల్ )
