ఏం ఐడియానా :CID అధికారులు అంటూ ప్రైవేట్ స్కూళ్ల నుంచి డబ్బులు వసూళ్లు

ఏం ఐడియానా :CID అధికారులు అంటూ ప్రైవేట్ స్కూళ్ల నుంచి డబ్బులు వసూళ్లు

సూటు, బూటు, చేతిలో ఫైళ్లు, మెడలో గుర్తింపు కార్డులు, ముఖంలో గంభీరమైన కవళికలు... చూడగానే ఎవరికైనా  అరెరే వీళ్లదో పెద్ద ఉన్నతాధికారుల బృందం అనిపించేలా బిల్డప్..ఏమాత్రం బెదురు లేకుండా నేరుగా విద్యాసంస్థలు, పెద్దపెద్ద వ్యాపార ఆఫీసుల్లోకి దర్జాగా వెళుతూ..మేము సీఐడీ అధికారులం.. మీ సంస్థపై మాకు ఫిర్యాదులు అందాయి, తనిఖీలు చేయాలి" అంటూ హల్ చల్ చేసింది ఓ ముఠా. అందినకాడికి దండుకుంటోంది.  ఇలా పలువురిని మోసం చేసి డబ్బులు గుంజుతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులు చివరికి ఒరిజినల్ పోలీసులకు చిక్కి జైల్లో చిప్పకూడు తింటున్నారు. వివరాల్లోకి వెళితే.. 

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో సీఐడీ అధికారులుగా నటిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపారాల యజమానులను మోసం చేసిన ఆరోపణలపై ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం(ఏప్రిల్3) చంద్రశేఖర్‌పూర్ పోలీస్ పరిధిలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థ బయట డబ్బులు చేస్తుండగా ఎనిమిది మంది నిందితులను పట్టుకున్నారు. 

►ALSO READ | బెంగళూరు రోడ్ల పై వాహనాల జాతర: కిలోమీటరుకు 900 బళ్లు ! జనం ఉక్కిరిబిక్కిరి...

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిజమైన సీఐడీ అధికారులమని చెప్పుకుంటూ ఈ ముఠా స్కూల్స్ , కాలేజీలు, బిజినెస్ సంస్థల ఆఫీసుల్లో ప్రవేశించి సోదాలు చేస్తున్నారు. కంపెనీలపై లోపాలను ఎత్తి చూపుతూ యజమానులు ,నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. 

అసలు హీరోలొచ్చారు.. నకిలీల ఆట కట్టించారు..

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా! పాపం పండక మానదు. స్థానిక చంద్రశేఖర్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ దగ్గర వీరు చేసిన ఓవరాక్షన్ వారి కొంపముంచింది. యజమానిని బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. పక్కా సమాచారంతో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన  అసలు పోలీసులు.. 'నకిలీ' సీఐడీల గుట్టు రట్టు చేశారు. ఏకంగా ఎనిమిది మంది ముఠాను ఒకేసారి పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.