బెంగళూరు రోడ్ల పై వాహనాల జాతర: కిలోమీటరుకు 900 బళ్లు ! జనం ఉక్కిరిబిక్కిరి...

 బెంగళూరు రోడ్ల పై వాహనాల జాతర: కిలోమీటరుకు 900 బళ్లు ! జనం ఉక్కిరిబిక్కిరి...

బెంగళూరు నగరం వాహనాల భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 2026 మార్చి చివరి నాటికి బెంగళూరు సిటీలో వాహనాల సంఖ్య 1.2 కోట్లు దాటేసింది. అంటే, నగరంలోని ప్రతి కిలోమీటరు రోడ్డు మీద సుమారు 900 వాహనాలు ఉన్నాయన్నమాట. పెరిగిన వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు పెరగకపోవడంతో జనం నరకం చూస్తున్నారు.

గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు 7.9 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. అంటే రోజుకు సగటున 2,100 పైగా కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. సరిపడా బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా సౌకర్యాలు లేకపోవడమే జనం సొంత వాహనాలు కొనుక్కోవడానికి ప్రధాన కారణం. మొత్తం వాహనాల్లో 86 లక్షల ద్విచక్ర వాహనాలు బైకులు/స్కూటర్లు  ఉంటే, 24.8 లక్షల కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా లక్షలాది క్యాబ్‌లు, ఆటోలు రోడ్ల మీద తిరుగుతున్నాయి.

ALSO READ : పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌ ధరలు..

వాహనాల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం ఆదాయం మాత్రం కాసుల వర్షం కురిపిస్తూ భారీగా పెరుగుతోంది. హెచ్‌ఎస్‌ఆర్ (HSR) లేఅవుట్ ఆర్‌టిఓ కర్ణాటకలోనే అత్యధిక ఆదాయం సంపాదించే ఆఫీసుగా నిలిచింది. గతేడాది ఇక్కడ రూ. 1,273 కోట్ల ట్యాక్స్ వసూలైంది. జాతీయ స్థాయిలో చూస్తే, పూణే తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే మూడవ ఆర్‌టిఓ ఆఫీసుగా హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ నిలిచింది. కస్తూరినగర్, జయనగర్ ఏరియాలు కూడా భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే బెంగళూరులో ప్రయాణం చేయాలంటేనే పరిస్థితి అర్థమవుతోంది. రోడ్లు అవే.. కానీ బళ్లు మాత్రం లక్షల్లో పెరుగుతూనే ఉన్నాయి!