ఎర్రకోట ఘటనను చూసి సిగ్గుతో తలదించుకున్నా

ఎర్రకోట ఘటనను చూసి సిగ్గుతో తలదించుకున్నా

చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 300 మంది పోలీసులు గాయాలపాలవ్వగా, ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పందించారు. హింసకు పాల్పడిన వారు దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనను చూసి సిగ్గుతో తలదించుకున్నా. ఎర్రకోటలో హింసకు పాల్పడిన వారిలో రైతులు లేరు. కానీ మతం పేరిట కొందరు యువతను తప్పుదారి పట్టించి హింసను సృష్టించారు. ఈ ఘటనకు కారకులైన వారు దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. దీనిపై ఢిల్లీ పోలీసులు లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనలో ఏవైనా రాజకీయ పార్టీలు లేదా దేశాల హస్తం ఉందా అనే దానిపై కేంద్రం ఇన్వెస్టిగేషన్ చేయించాలి. అదే సమయంలో రైతు సంఘాల నేతలను పోలీసులు కావాలని టార్గెట్ చేసుకొని హింసించకుండా చూడాలి’ అని అమరిందర్ సింగ్ చెప్పారు.