- ఢిల్లీలోని పీర్గఢీ ఫ్లైఓవర్ పై మిస్టరీ
- ఆత్మహత్యలా లేక ఎవరైనా మర్డర్ చేశారా..
- పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలు ఆసుపత్రికి తరలింపు
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని ఓ ఫ్లైఓవర్ పై నిలిపి ఉంచిన కారులో మూడు మృతదేహాలు కనిపించడం పీర్ గఢీలో కలకలం రేపింది. ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డుపై నిలిపి ఉంచిన టాటా టియాగో కారులో ఈ విషాదం వెలుగు చూసింది. మృతులను రణధీర్ (76), శివ నరేష్ సింగ్ (47), లక్ష్మి (40)గా గుర్తించారు. ఆదివారం ఫ్లైఓవర్ పై కారు చాలాసేపటి నుంచి కదలకపోవడంతో వాహనదారులు దగ్గరికి వెళ్లి పరిశీలించారు. కారు లోపల ముగ్గురు వ్యక్తులు అపస్మారక స్థితిలో కనిపించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు తలుపులు తెరిచి ముగ్గురినీ పరీక్షించగా.. అప్పటికే వారు మరణించినట్లు తేలింది. కాగా, మృతదేహాలపై ఎలాంటి శారీరక గాయాలు లేకపోవడం, కారులోని వస్తువులు ఏవీ చోరీకాకపోవడం గుర్తించారు. దీంతో ఆ ముగ్గురూ విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి మధ్య ఉన్న బంధుత్వం మరియు మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. ఈ మరణాల వెనుక కుటుంబ సమస్యలు ఉన్నాయా లేదా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని వివరించారు.
